తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ పార్టీపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీకి రేవంత్ రెడ్డి ఔట్ సోర్సింగ్ ఏజెంట్‌గా మారారని సుమన్ దుయ్యబట్టారు. బుధవారం టీఆర్ఎస్ఎల్పీలో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు.
రాహుల్ గాంధీకి తెలుగు రాకున్నా తెలుగులో ట్వీట్లు చేస్తున్నారు. ధాన్యం సేకరణపై బీజేపీ విధానానికి కాంగ్రెస్ పరోక్షంగా మద్ధతిస్తోందని మండిపడ్డారు. పార్లమెంట్‌లో ఎంపీగా బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించని రేవంత్ మమ్మల్ని ప్రశ్నించడం సరికాదన్నారు. రైతులను రేవంత్ గందరగోళ పరుస్తున్నాడని ధ్వజమెత్తారు. రేవంత్‌ది అంతా నకిలీ మకిలీ చరిత్రే.. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు అవినీతి డబ్బుతో ఖూనీ చేసిన రేవంత్ నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
బీజేపీకి తాకట్టు పెట్టడం ఖాయం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు చెప్పులు మోసిన రేవంత్.. ఇప్పుడు బీజేపీ ఏజెంట్‌గా మారాడని సుమన్ అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని హోల్ సేల్‌గా బీజేపీకి తాకట్టు పెట్టడం ఖాయమన్నారు. రేవంత్ బారి నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడంపై రాహుల్ గాంధీ దృష్టి సారించాలని సూచించారు.
కేటీఆర్ గ్లోబల్ లీడర్.. రేవంత్ రవ్వంత..
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అమెరికాలో ఏడు రోజుల పాటు పర్యటించి, రాష్ట్రానికి అనేక పెట్టుబడులు సాధించారని సుమన్ గుర్తు చేశారు. కేటీఆర్ గ్లోబల్ లీడర్.. ఆయన కాలి గోటికి కూడా సరిపోరని నిప్పులు చెరిగారు. కేటీఆర్ ముందు రేవంత్ రవ్వంత అని విమర్శించారు. తెలంగాణ ప్రగతిలో రేవంత్ ఓ ముళ్లులా మారాడు. సందర్భం వచ్చినప్పుడు ఆ ముళ్లును ఎలా తీసేయాలో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసన్నారు. రేవంత్‌కు మళ్లీ చిప్పకూడు తప్పదని బాల్క సుమన్ హెచ్చరించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం పాల్గొన్నారు.