భారత మహిళల క్రికెట్‌పై వంద పేజీల పుస్తకం రాస్తే 80 వరకు ఆమె గురించే రాయల్సి ఉంటుంది. క్రికెటర్‌గా ఆమె ప్రస్థానం మహిళల క్రికెట్ పురోగమనం సమాంతరంగా సాగుతాయి. ఆమె మరెవరో కాదు మిథాలీరాజ్. చిన్న వయసులోనే ఆటలో అరంగేట్రం చేసి ఎవరికీ సాధ్యం కాని ఘనతలు అందుకుంది. తాజాగా మరే క్రికెటర్ సాధించని ఓ రికార్డు సృష్టించింది.
అంతర్జాతీయ క్రికెట్లో భారత మహిళల క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనత సాధించింది. మహిళల క్రికెట్లో 200 వన్డేలు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. ఉమెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎక్కువ కాలం కొనసాగిన క్రీడాకారిణి కూడా ఆమెనే కావడం విశేషం. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 200వ వన్డే ఆడిన మిథాలీ.. చిరస్మరణీయ గేమ్‌లో 28 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులు మాత్రమే చేసింది. ఐసీసీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కివీస్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
36ఏండ్ల మిథాలీ వన్డేల్లో 51.33 సగటుతో 6622 పరుగులు సాధించి అత్యధిక రన్స్ చేసిన మహిళా క్రికెటర్‌గా అగ్రస్థానంలో నిలిచింది. అందులో 7 శతకాలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా మిథాలీ సహచర క్రికెటర్ల సమక్షంలో కేక్ కూడా కట్ చేసింది. 1999లో వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేసిన మిథాలీ 263 వన్డేలు ఆడింది. ఇప్పటి వరకు 10 టెస్టులు.. 85 టీ20లు ఆడింది. భారత మాజీ క్రికెటర్లు అద్భుత రికార్డు సాధించిన మిథాలీరాజ్‌కు అభినందనలు తెలుపుతున్నారు.