తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను వైభవంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహముద్ అలీ అధికారులను ఆదేశించారు. మంగళవారం బోనాల ఏర్పాట్లు, నిర్వహణపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ… అధికారులతో అరణ్య భవన్‌లో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బోనాలకు వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీలు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయాల వద్ద క్యూలైన్లు,నీటి సౌకర్యం కల్పించాలన్నారు. భక్తులు తప్పనిసరిగా మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి దర్శనాలు చేసుకోవాలని కోరారు. ఆలయాల వద్ద కూడా మాస్కులను, శానిటైజర్ల్ ఉండేలా చూడాలని తెలిపారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు 15 కోట్ల రూపాయలు మంజూరు చేశారని ఆ నిధులను సద్వినియోగం చేసుకుని బోనాలను ఘనంగా నిర్వహించాలన్నారు.
ఉత్సవాల నిర్వహణ, అలంకరణ, పూజ కార్యక్రమాలకు ప్రభుత్వం ఇచ్చే నిధులను సకాలంలో ఆలయ కమిటీలకు మంజూరు చేయాలన్నారు. అమ్మవారి ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దాలని, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించాలని తెలిపారు. సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు. ఆలయాలో పాటు జంట నగరాల్లోని ప్రముఖ ప్రదేశాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని మంత్రులు సూచించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.