దివ్యాంగుల కోసం వినూత్న పథకాలు: మంత్రులు

171
Ministers
- Advertisement -

హుజురాబాద్ మార్కెట్ యార్డ్ ఆవరణలో హుజురాబాద్ డివిజన్ కు సంబంధించిన 623 మంది దివ్యాంగులకు తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో సుమారు రెండు కోట్ల విలువ గల ఉచిత సహాయక ఉపకరణాలను బ్యాటరీ వీల్‌చైర్లు, చేతికర్రలు, త్రీవీలర్‌, వినికిడి యంత్రాలు, స్కూటీలు మొదలగు పరికరాలు అర్హులైన దివ్యాంగులకు పంపిణీ చేశారు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. సమైక్య పాలనలో వికలాంగులను పట్టించుకోలేదు. వికలాంగుల శాఖ మొక్కుబడిగా ఉండేది, వారి అవసరాలను తీర్చేది కాదని విమర్శించారు. దివ్యాంగులను కన్నబిడ్డల్లా అక్కున చేర్చుకున్న ఘనత సిఎం కెసిఆర్‌ది. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుంది అన్నారు. దివ్యాంగుల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగంలో ఉన్నది. దివ్యాంగులకు బాసటగా నిలవడమే తెలంగాణ ప్రభుత్వ ఆశయం. సాటి మనిషి కష్టం, బాధ అర్థం చేసుకొని తీర్చగలిగినప్పుడే మానవ జన్మకు అర్థం, పరమార్థం ఉంటాయని సీఎం కేసీఆర్‌ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. వారి ముఖాల్లో చిరునవ్వు ఉంటేనే ప్రభుత్వంగా మాకు ఆత్మ సంతృప్తి ఉంటుందని మంత్రి తెలిపారు.

దివ్యాంగులకు వినూత్న సంక్షేమ పథకాలు అమలుచేస్తూ దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ముందున్నదని చెప్పారు. దివ్యాంగుల్లో ఆత్మగౌరవాన్ని పెంచడంతోపాటు.. ఎవరి సాయం లేకున్నా బతకగలమనే ఆత్మైస్థెర్యాన్ని వారిలో నింపిందని పేర్కొన్నారు. వికలాంగులకు రూ.3,016 పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ… ఏటా దివ్యాంగులకు రూ.1,800 కోట్లు పింఛన్‌ ఇస్తున్నాయని తెలిపారు. అర్హులైనవారు ఎవరు దరఖాస్తు చేసుకున్నా పరికరాలు అందజేస్తామని చెప్పారు. ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరైనా కలగని ఆత్మసంతృప్తి ఈ కార్యక్రమంలో కలుగుతున్నదన్నారు.

రూ. 2 కోట్లతో 623 మంది దివ్యాంగులకు ఉచిత ఉపకరణాలను పంపిణీ చేయడం గొప్ప విషయమని చెప్పారు. అన్నివర్గాలు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ముందుకు వెళుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, ఎమ్మెల్సీ శ్రీ నారదాసు లక్ష్మణ్ రావు, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ వాసుదేవ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కనుమల్ల విజయ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -