జాతీయ బాలల దినోత్సవ వేడుకలో పాల్గొన్న మంత్రులు..

125
- Advertisement -

జాతీయ బాలల దినోత్సవం అత్యంత ఘనంగా ఆదివారం రవీంద్ర భారతిలో జరిగింది. చిన్నారుల ఆటపాటలు, అల్లరితో సందడిగా సాగింది. వివిధ రకాల నృత్యాలు, జాతీయ గీతాలు, స్పూర్తికరమైన సందేశ చిత్రాలతో, చిన్నారుల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించే అద్భుత కార్యక్రమాలతో అత్యంత కమనీయంగా, కన్నుల పండువగా జరిగింది. రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమానికి హాజరై చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తమ ఆటపాటలతో అలరించిన చిన్నారులను అభినందించారు. ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఈరోజు చాలా సుదినం. పిల్లలు మా రోజు అని చెప్పుకుని ఆనందంగా గడిపే రోజు. ఈ ఉత్సాహం, సంతోషం వారికి జీవిత కాలం ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడకు వచ్చిన పిల్లలు అంతా వేదికపై మాట్లాడాలి అంటే మూడు రోజులు సరిపోదు.. వారం రోజులు కావాలి. వచ్చే సారి వారం రోజుల ఉత్సవాలు నిర్వహించుకుందామన్నారు. గత ఏడాది కరోనా వల్ల ఈ ఉత్సవం సరిగా జరుపుకొలేదు. వచ్చే ఏడాది రాష్ట్ర, జిల్లా స్థాయిలో మంచి ప్రణాళికతో బ్రహ్మాండంగా వారం రోజుల పాటు నిర్వహించుకుందాం అన్నారు.

ఈ రాష్ట్రంలో అనేక మంది బాలలు వారు చేయని తప్పుకు అనాథలుగా మారుతున్నారు. ఇలాంటి వారికి అందరితో సమానమైన అవకాశాలు కల్పించాలి అన్న తపన ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతూ ఉంది. సీఎం కేసిఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా బాలల హక్కులు, చట్టాలను అమలు చేస్తూ వారి ఆరోగ్యం, భద్రత కోసం కూడా అనేక చర్యలు చేపడుతూ వారిలో విశ్వాసం కల్పిస్తున్నారు. సమాజంలో కూడా కొంత మార్పు రావాలి. కొంతమంది దురదృష్టం కొద్ది తల్లిదండ్రులను కోల్పోతే…కొంతమంది అకారణంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇక్కడకు వచ్చిన వారు అనాథలుగా భావించకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉందని మంత్రి తెలిపారు.

కోవిడ్ కారణంగా అనాథలు అయిన వారిని ఆదుకోవాలని సీఎం కేసిఆర్ గారిని కోరితే… వారినే కాదు రాష్ట్రంలోని అనాథలందరికి రాష్ట్ర ప్రభుత్వమే అన్ని అయి… వారికి కుటుంబం ఏర్పడే వరకు అండగా ఉండే విధంగా ఒక విధానం రూపొందించాలని కేబినెట్ సబ్ కమిటీ వేశారు. త్వరలో ఈ విధానం అమలులోకి రానుంది. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల పిల్లలకు తల్లిదండ్రి, గురువు అన్ని అంగన్వాడీలు అయి పని చేస్తున్నారు. కోవిడ్ సమయంలో అంగన్వాడిలు చేసిన సేవలు చూసి కేంద్రం అవార్డులు ఇచ్చింది. అందుకే సీఎం కేసిఆర్ గారు కూడా వేతనాలు పెంచారు.

కేసిఆర్ కిట్, ఆరోగ్య పరీక్షలు, పౌష్ఠికాహారం అందించడం ద్వారా ఆరోగ్య తెలంగాణ సాధించుకుంటున్నాం. మన దగ్గర అమలు చేస్తున్న గ్రోత్ మానిటరింగ్ కు దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభించి, దేశమంతా దీనిని అమలు చేస్తాం అని కేంద్రం చెప్పింది. కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,00,116 రూపాయలు ఇవ్వడం ద్వారా బాల్య వివాహాలు గణనీయంగా తగ్గాయి. తల్లిదండ్రులు పిల్లలకు అవకాశం కల్పిస్తే గొప్ప వారు అవుతారు. తెలివితేటలు ఎవరి సొత్తు కాదు. కృషి చేస్తే అందరికీ దక్కుతాయన్నారు. మీ ముఖంలో నేడు ఉన్నఈ చిరునవ్వు కాపాడడానికి నిరంతరం మీ వెంట ఉంటాం. ప్రతి యేటా ఉత్సాహభరితంగా ఈ రోజు గడిపే ఏర్పాట్లు చేస్తాం. ఈ ఉత్సాహం జీవితకాలం ఉండేటట్లు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యవతి పేర్కొన్నారు.

మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. బాలల దినోత్సవం సందర్భంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టిన రోజు ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ ఉత్సవంలో పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ చేసిన ప్రదర్శనలు చేయడానికి సినిమా వాళ్లు చాలా రోజులు ప్రాక్టీస్ చేస్తారు. కానీ మన పిల్లలు అతి తక్కువ సమయంలో సినిమా వాళ్లకు తీసిపోని విధంగా డాన్స్ లు వేశారు. పాటలు పాడారు. సీఎం కేసిఆర్ గారి నాయకత్వంలో మంత్రి సత్యవతి రాథోడ్ ఈ పిల్లలను సొంత బిడ్డలుగా చూసుకోవాలని అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలా చేయలేదు. వారికి ఆహారం, విద్య, శిక్షణ ఇవ్వడంలో అత్యంత శ్రద్ధ చూపుతున్నారు. ఇందుకు కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్యని, సిబ్బందిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.

ఈ శాఖకు మంత్రి సత్యవతి రాథోడ్ ఒక తల్లిగా ఉండడం కూడా గొప్ప విషయం. పిల్లలకు సమాజ అవగాహన కల్పించే ఉద్దేశంతో వారికి విహార యాత్రలు ఏర్పాటు చేయడం, వారికి క్రీడల్లో ప్రోత్సహించడం అనేవి మంచిది. నేడు అంతటా పిల్లలకు సన్నబియ్యం అన్నం పెడుతున్నారు. తెలంగాణలో అనాథ పిల్లలుగా ఉండకూడదని ప్రభుత్వమే తల్లి దండ్రులుగా వారికి రక్షణ కవచంగా ఉండాలని కేబినెట్ సబ్ కమిటీ వేశారు. త్వరలో ఈ నిర్ణయం అమలు కానుంది. ఈ ప్రభుత్వం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది. ఈ కాలం పిల్లలు చాలా చురుకుగా ఉన్నారు. అనాథ పిల్లల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. పిల్లలు కూడా ప్రభుత్వం కల్పించే సదుపాయాలను ఉపయోగించుకుని గొప్ప స్థాయికి రావాలి, దేశానికి ఆదర్శంగా ఎదగాలి అని మంత్రి సూచించారు.తెలంగాణ ప్రభుత్వంలో గురుకులాలు పెట్టీ పిల్లల సమగ్ర అభివృద్ధికి కృషి జరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చిన్నారులు అంటే ఇష్టం కాబట్టి… ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేసి వారి భవిష్యత్ ను నిలబెట్టే విధంగా పని చేస్తున్నారని తెలిపారు.

అనంతరం ప్రతిభ కలిగిన పిల్లలను, సిబ్బందిని మంత్రులు జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శ్రీనివాస రావు, సభ్యులు రాగజ్యోతి, అపర్ణ, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవ రాజన్, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -