రాధా హత్యకు రెక్కీ.. చంద్రబాబుపై మంత్రి విమర్శలు..

24

వంగవీటి రాధాను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారన్న అంశంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాధా హత్యకు రెక్కీ జరిగిన ఆధారాలు ఉంటే బయట పెట్టాలన్నారు. రెక్కీ ఎవరు చేయబోయారో రాధా బయటపెట్టాలన్నారు. రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు చెప్పినట్టు రాధా చేయకూడదన్నారు. ఇప్పటికే రాధాను రాజకీయాల్లో మర్చిపోయారని, చంద్రబాబు తప్పుడు డైరెక్షన్‌లో రాధా ప్రయాణం చేయకూడదన్నారు.

వంగవీటి మోహన్ రంగా టీడీపీ హయాంలో ఎందుకు దీక్ష చేశారో రాధా తెలుసుకోవాలని మంత్రి వెల్లంపల్లి అన్నారు. టీడీపీ హయాంలో రంగా హత్య జరిగితే అదే పార్టీతో రాధా అంటకాగుతున్నారని విమర్శించారు. రెక్కీపై ఇంతవరకు పోలీసులకు ఫిర్యాదు చేసారా? అని మంత్రి ప్రశ్నించారు. మెయిన్ రోడ్డులో రాధా ఇల్లు ఉంది.. అక్కడ కారు తిరిగితే రెక్కీ అవుతుందా? అని నిలదీశారు. హత్యా, రెక్కీ అంటారు.. భద్రత కోసం గన్ మెన్లను పంపితే వెనక్కి పంపి చీప్ రాజకీయాలు చేస్తారా? అంటూ మండిపడ్డారు.

రాధా రెక్కీ అంశంపై వెంటనే సీఎం జగన్ స్పందించారని, రాధా తమ పార్టీకి సంబందంలేని వ్యక్తయినా గన్ మెన్లను కేటాయించారని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. రాధాను చంద్రబాబు పరామర్శించడం దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మొరిగానట్టు ఉందని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు అని, వంగవీటి రాధాతో చంద్రబాబు డ్రామా చేయిస్తున్నారని వెల్లంపల్లి విమర్శించారు.