యాదాద్రి స్వర్ణ తాపడం కోసం నిలువుదోపిడీ ఇచ్చిన మంత్రి..

15

నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబ సమేతంగా ఆదివారం యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ గోపురానికి స్వర్ణ తాపడం కోసం ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు, భక్తులు, దాతలు శక్తిమేరకు సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంత్రి సత్యవతి రాథోడ్ నేడు స్వామి వారికి నిలువుదోపిడీగా తనకున్న బంగారు నగలన్నీ భక్తితో సమర్పించారు.

నూతన సంవత్సరంలో మొదటి సారి స్వామి వారిని దర్శించుకునే సందర్భంగా నిలువుదోపిడీ ఇచ్చే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమన్నారు. త్వరలో తన కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరుల ద్వారా స్వర్ణ తాపడం కోసం మరింత బంగారం,డబ్బులు విరాళం ఇస్తామన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉండేలా చూడాలని, ఒమిక్రాన్, ఇతర వైరస్‌ల నుంచి ప్రజలను రక్షించాలని ప్రార్థించినట్లు మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడం కోసం అహరహం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరింత శక్తిని ఇవ్వాలని, మరిన్ని గొప్ప సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా చల్లగా చూడాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.

కలలో ఊహించని విధంగా యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయాన్ని సీఎం కేసిఆర్ అద్భుతంగా అభివృద్ధి చేశారన్నారు. ఇప్పుడు వేలు, లక్షలుగా వస్తున్న భక్తులతో యాదాద్రి క్షేత్రం కిటకిటలాడుతూ.. కన్నుల పండువగా ఉందన్నారు. మరో రెండు నెలల్లో ప్రజలు స్వామి వారిని దర్శించుకునేందుకు యాదాద్రి క్షేత్రం అందుబాటులోకి రానుండడం సంతోషదాయకం అన్నారు.

ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలనే గొప్ప సంకల్పంతో దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్నారని చెప్పారు. తాము హిందువుల ప్రతినిధులుగా చెప్పుకునే బీజేపీ నేతలు అయోధ్య రామాలయ నిర్మాణానికి దేశమంతా విరాళాలు సేకరిస్తుంటే యాదాద్రి పునః నిర్మాణంలో సీఎం కేసిఆర్ స్వయంగా ఇంజనీర్, ఆర్కిటెక్ట్ గా కృషి చేసి గొప్పగా అభివృద్ధి చేశారన్నారు. మరోసారి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సత్యవతి రాథోడ్.