పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనేదే ప్రభుత్వ లక్ష్యం- మంత్రి

22

పేదలు ఆత్మ గౌరవంతో డబుల్ బెడ్ ఇండ్లలో జీవించాలన్నది సీఎం కేసిఆర్ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. కోరుట్ల నియోజకవర్గంలోని మెట్‌పల్లి మండలం ఆత్మ కూరు, కోండ్రికర్ల గ్రామాలలో 205లక్షల వ్యయంతో 33 ఇండ్లకు గాను నిర్మాణం పూర్తి చేసుకున్న 24 డబుల్ బెడ్ రూం ఇండ్లను శనివారం స్థానిక శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ ఛైర్పెర్సన్ లతో కలిసి మంత్రి కొప్పుల లబ్దిదారులకు అందజేశారు. ముందుగా గ్రామంలో అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గోన్న మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు కొంత బ్యాంకు రుణం, కొంత సొంత ఖర్చు, కొంత సబ్సీడితో ఇండ్లు అందించే వారని, తెలంగాణ ప్రభుత్వం 100 శాతం ప్రభుత్వ ఖర్చుతో నిర్మించి అందిస్తున్నామని తెలిపారు. గూడు లేని నిరుపేదలకు సకల సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూం ఇండ్లలో ఆత్మ గౌరవంతో జీవించాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వప్నమని తెలిపారు.

డబుల్ బెడ్ రూం ఇండ్ల పట్ల ప్రజలలో అధిక డిమాండ్ ఉన్నప్పటికి పలు కారణాల వల్ల నిర్మాణం ఆలస్యమవుతుందని మంత్రి తెలిపారు. భూ సమస్య, కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం, మౌలిక వసతుల కల్పన వంటి పలు సమస్యల గుర్తించామని అన్నారు. ప్రజలలో అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో సీఎం కేసిఆర్ త్వరలో నూతన పథకం ప్రారంభిస్తారని,స్థలం ఉన్న వారికి ఇండ్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల వరకు ఆర్థిక సహయం అందజేస్తారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పేద ప్రజలకు సీఎం కేసిఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందిస్తున్నామని త్వరలో అర్హులైన మిగిలిన వారికి సైతం పెన్షన్లు మంజూరు చేస్తామని తెలిపారు గత సంవత్సరం బడ్జేట్‌లో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి 11 వేల కోట్లను సీఎం కేటాయించారని, కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో నూతన పథకం ప్రారంభించలేదని, ప్రస్తుతం కరోనా నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో త్వరలోనే నూతన పథకం సీఎం కేసిఆర్ ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలో అభివృద్ది కోసం పటిష్ట చర్యలు చేపడుతున్నామని, ప్రతి ఇంటికి త్రాగు నీరు సరఫరా చేసామని, ప్రతి గ్రామంలో నర్సరీ, డంపింగ్ యార్డు, ట్రాక్టర్, ట్యాంకర్, స్మశానవాటిక నిర్మించామని తెలిపారు. పచ్చదనం పెంపొందించే దిశగా చేపట్టిన తెలంగాణకు హరితహారం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని, రాష్టంలో పచ్చదనం పెరిగిందని అన్నారు. రైతు సంక్షేమం దిశగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుంటే, రైతు వ్యతిరేక విధానాలతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఇప్పటి వరకు 50 వేలకోట్లు రైతుబంధు కింద అందించిందని, ప్రతి సంవత్సరం 1500 కోట్ల వ్యయంతో రైతు భీమా పథకం, 10 వేల కోట్ల వ్యయంతో 24 గంటల ఉచిత విద్యుత్తు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని మంత్రి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో ధాన్యం కొనుగోలు నిలిపివేసిందని, దీనిపై వారిని ప్రతి ఊర్లో నిలదీయాలని మంత్రి పిలుపునిచ్చారు. రైతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, రాష్ట్రంలో 99% చిన్న సన్నకారు రైతులు ఉన్నారని, వారి కోసం రైతు బంధు పథకం అమలు చేస్తున్నామని, రైతు బంధు కింద యాసంగిలో 62 లక్షల రైతులకు 7600 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టాలని చుస్తుందని, మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేసారని, తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితులో మోటార్లకు మీటర్లు పెట్టబోమని సీఎం కేసిఆర్ తెలిపారని అన్నారు. కృష్ణా,గోదావరి నదులపై లక్షల కోట్లు ఖర్చు పెట్టి సీఎం కేసిఆర్ ప్రాజెక్టులు నిర్మీస్తే వాటిపై పెత్తనం చెలాయించాలని కేంద్ర ప్రభుత్వం చుస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, జిల్లా కలెక్టర్ జి.రవి, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, రెవెన్యూ డివిజన్ అధికారి వినోద్ కుమార్, సర్పంచులు లావణ్య, రాజగంగు, జడ్పీటీసీ రాధ, ఎంపీపీ సాయిరెడ్డి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గోన్నారు.