ఉస్మానియా ఆస్పత్రి భవనాలు కూలితే దానికి బాధ్యులు ఎవరని మండిపడ్డారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇవాళ మీడియాతో మాట్లాడిన తలసాని… ఉస్మానియా ఆస్పత్రిలోకి వర్షం నీళ్లు రావటంతో ప్రతిపక్షాలు చేసిన విమర్శలపై మండిపడ్డారు.ఉస్మానియా ఆసుపత్రికి వరద రావటం ఇదే మొదటిసారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ దొంగలు ప్రజారోగ్యంపై డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు.
2015లోనే ఉస్మానియాను ఆధునీకరిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని అన్నారు. ప్రజల ఆరోగ్యంపై సీఎంకు స్పష్టమైన ప్రణాళిక ఉందన్నారు. పేదల కోసం 27ఎకరాల్లో ఉస్మానియాను పునర్మిస్తామంటే ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్ళాయని… ప్రజల ప్రాణాలు దృష్టిలో పెట్టుకుని ఉస్మానియా ఆసుపత్రి కేసును హైకోర్టు సూమోటాగా స్వీకరించాలని కోరారు.
తెలంగాణలో ఉన్న దరిద్రమైన ప్రతిపక్షాలు ఎక్కడాలేవని…అక్కసుతోనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని తెలిపారు. సచివాలయంలో గుప్త నిధులు ఉన్నాయనడం హాస్యాస్పదమని…బీజేపీ నాయకులు ఢిల్లీలో ఒక డ్రామా.. హైద్రాబాద్ మరో డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.