రాష్ట్ర అవసరాలకు సరిపడా చేపపిల్లలను మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయాలని, అందుకు అవసరమైన చర్యలు పూర్తిస్థాయిలో చేపట్టాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మత్స్య శాఖ కార్యక్రమాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం అమలు కోసం కోట్లాది చేప పిల్లలను పొరుగు రాష్ట్రాల నుండి కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో నూతన ప్రాజెక్టుల నిర్మాణంతో పెద్ద ఎత్తున నీటి వనరులు అందుబాటులోకి వచ్చాయని, దీంతో భారీగా చేపపిల్లలు అవసరం ఉంటుందని మంత్రి చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అవసరమైన చేప పిల్లలను రాష్ట్రంలోని ప్రభుత్వ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలలోనే ఉత్పత్తి చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రంలో 389 ఎకరాల విస్తీర్ణంలో 24 చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయని, వీటిలో కొన్ని కేంద్రాలలో చేప పిల్లల ఉత్పత్తి జరుగుతుందని, మిగిలిన కేంద్రాలలో కూడా చేప పిల్లల ఉత్పత్తి చేపట్టాలని ఆదేశించారు. 2019-20 సంవత్సరంలో 2.11 కోట్లు, 2020-21 సంవత్సరంలో 2.40 కోట్ల చేప పిల్లలను మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. మిగిలిన ఉత్పత్తి కేంద్రాల పరిధిలో ఉన్న 179 ఎకరాల విస్తీర్ణంను వినియోగంలోకి తీసుకొస్తే 23 కోట్ల చేప పిల్లలను ఉత్పత్తి చేసే అవకాశాలున్నాయని వివరించారు.
వీటిలో ఉన్న సిల్ట్ తొలగింపు, పైప్ లైన్ మరమ్మతులు, బోరుబావి ఏర్పాటు వంటి పనులు చేపట్టాల్సి ఉందని, వెంటనే ఆపనులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా ను ఆదేశించారు. అవసరమైన చోట్ల NREGS క్రింద పనులు చేపట్టాలని చెప్పారు. కొన్ని కేంద్రాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేసి చేప పిల్లల ఉత్పత్తి చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ప్రైవేటు వ్యక్తులు ముందుకొస్తే ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతను అందిస్తుందని అన్నారు. చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమంతో రాష్ట్రంలో మత్స్య సంపద పెద్ద ఎత్తున పెరిగిందని, వీటిని విక్రయించుకొని మత్స్యకారులు జీవనం సాగిస్తూ ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. ప్రజలకు చేపలను నాణ్యతతో పరిశుభ్రమైన వాతావరణంలో అందించేందుకు, మత్స్యకారులు గిట్టుబాటు ధరకు చేపలను విక్రయించు కోవడానికి రిటైల్ ఔట్ లెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మత్స్య ఫెడరేషన్‌ను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. మత్స్యకారుల నుండి ఫెడరేషన్ ద్వారా చేపలను కొనుగోలు చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని అన్నారు. అంతేకాకుండా మత్స్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో హోల్ సేల్ చేపల మార్కెట్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని గుర్తించాలని చెప్పారు. వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసే రిటైల్ ఔట్ లెట్ లకు ఫెడరేషన్ ద్వారా చేపలను సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మత్స్య సంపద ఉత్పత్తిని పెంచడానికి, ప్రాసెసింగ్ కు నూతన టెక్నాలజీని వినియోగించాలని, అవసరమైతే MPEDA, NFDBల సహకారం తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొబైల్ ఫిష్ ఔట్ లెట్ లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినదని, ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నదని, కోడ్ ముగిసిన అనంతరం మొబైల్ ఫిష్ ఔట్ లెట్ లను లబ్దిదారులకు అందజేయనున్నట్లు మంత్రి వివరించారు.