రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ప్రముఖ కూచిపూడి నర్తకి డా. పద్మజా రెడ్డి ‘కాకతీయం’ నృత్య కళా రూపంపై రూపొందించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రాడ్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన సునీతా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… కాకతీయం పేరుతో కాకతీయుల కాలం నాటి నృత్య కళారూపంపై అద్భుతమైన పరిశోధనలు నిర్వహించిన డా. పద్మజా రెడ్డి నేతృత్వంలో సుమారు 100 మంది కళాకారులతో కలసి కాకతీయం డాన్స్ బ్యాలెట్ ను డిసెంబర్ 26న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరుగుతున్న ప్రదర్శన నిర్వహిస్తున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షణకు ఎన్నో చర్యలు చేపట్టారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణకు చెందిన మహనీయులను, కవులను, కళాకారులను, సాహితీవేత్తలను, చరిత్ర కారులను, సాంఘిక వేత్తల గౌరవార్థం వారి జయంతి, వర్ధంతి లను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా ఘనంగా, వారి సేవలు నేటి తరానికి తెలిసేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు రామప్ప దేవాలయంకు యూనెస్కో గుర్తింపుకు కృషి చేయలేదన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి వల్ల తెలంగాణ ఆర్కియాలజీ, టూరిజం శాఖల కృషి వల్ల కాకతీయుల కాలంలో నిర్మించిన అద్భుత శిల్పా కళా వైభవం రామప్ప దేవాలయంకు యూనెస్కో గుర్తింపు లభించిందన్నారు. అంతేగాకుండా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 170 దేశాల నుండి బెస్ట్ టూరిజం విల్లేజ్ కోసం వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సంస్థ నిర్వహించిన పోటీల్లో నిక్కత్ చీరలకు ప్రసిద్ధి గాంచిన పోచంపల్లికి ప్రపంచంలోనే బెస్ట్ టూరిజం విల్లేజ్ గా గుర్తింపు లభించిందన్నారు. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో రాష్ట్రంలో పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన మన బతుకమ్మ, బొడ్డెమ్మతో పాటు పెరణి నృత్యం దేశంలోనే తెలంగాణ రాష్ట్రంకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
తెలంగాణ రాష్ట్రం లో అదిమనవుని అవశేషాలతో పాటు, శాతవాహనుల కాలం చారిత్రక అవశేషాలు, బుద్ధిజం తో పాటు కాకతీయుల, అసఫ్ జాహి, నిజాం కాలం నాటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలను, ప్రాచీన కాలం నాటి కళలు, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు. కాకతీయుల కాలం తెలంగాణ చరిత్రలోనే ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు వైభవాన్ని తీసుకొచ్చారన్నారు. కాకతీయుల కాలంలో వ్యవసాయానికి, కళలకు, సాంప్రదాయాలకు పెద్ద పీట వేశారన్నారు మంత్రి. కాకతీయుల కాలంలో జయాపసేనని రూపొందించిన నృత్య రత్నావళిలో పేర్కొన్నా కళారూపాలను డా. జి. పద్మజా రెడ్డి కాకతీయం పేరుతో 100 మంది కళాకారులతో కాకతీయం కళారూపకాన్ని ఈనెల (డిసెంబర్) 26 న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ప్రదర్శన నిర్వహిస్తారన్నారు. ఈ ప్రదర్శనను అందరూ ఆదరించాలని మంత్రి పిలుపునిచ్చారు.
నృత్య రత్నావళిలో పేర్కొన్న నృత్య రూపకాలపై కాకతీయం పేరుతో పరిశోధన చేసి ప్రజలకు అర్థం అయ్యేరీతిలో డా. పద్మజా రెడ్డి నృత్యాలను రూపొందించి ప్రదర్శన నిర్వహించటం ఎంతో అభినందనీయమన్నారు. డాక్టర్ జి. పద్మజా రెడ్డి విస్తృతమైన పరిశోధనలు చేసి అనేక దేవాలయాలలో (వెయ్యి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం మరియు కాకతీయుల కాలంలో నిర్మించిన దేవాలయాలు) విస్తరించి ఉన్న వివిధ శిల్పాలను అధ్యయనం చేయడం ద్వారా “నృత్త రత్నావళి” పుస్తకంలోని సైద్ధాంతిక నృత్య భావన వివరాలను దృశ్య కళారూపంగా ఆవిష్కరించి నేటి యువతకు అందించటం గొప్ప విషయమన్నారు. డా. పద్మజా రెడ్డి కాకతీయం కళా రూపం పార్ట్ 1 లో (2017) బ్రమరి , కంధుక నృత్యం, కోలాట్టం, లాస్యంగము వంటి అంశాలపై ప్రదర్శించారన్నారు. అలాగే కాకతీయం పార్ట్ 2 (2021) లో గొండలి, రసకం, చరణ, పేరిణి మరియు శివ ప్రియుల భావనలపై కళా రూపాల ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు.
ప్రాచీన కళలు, సాంప్రదాయాల పరిరక్షణకు తెలంగాణ సాంస్కృతిక శాఖ ద్వారా ఎంతో కృషి చేస్తున్నామన్నారు. కాకతీయుల కాలం నాటి కళా రూపాలపై పరిశోధనలు చేసి నేటి కాలానికి అనుగుణంగా అద్భుతమైన కళా నృత్యాలను రూపొందించి ప్రదర్శనలను నిర్వహిస్తున్నా డా. పద్మజా రెడ్డికి, కళలు, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న అందుకు సహాకారాన్ని అందిస్తున్న సింగపూర్‌కు చెందిన ప్రముఖ కంపెనీ ప్రాడ్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన సునీతా రెడ్డిలకు అభినందనలు తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.