ఈ ఏడాది రబీలో వేరుశనగ సాగు పెరగనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులతో హాకా భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్ధసారధి, తెలంగాణ సీడ్స్ డైరెక్టర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. సాగునీటి రాకతో వేరుశనగ సాగు భారీగా పెరుగుతుంది.ఇక నుండి వేరుశనగ ఉత్పత్తి కూడా పెద్దఎత్తున ఉంటుందని ఆయన అన్నారు.ఉమ్మడి పాలమూరుతో పాటు నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాలలో వేరుశనగ సాగు ఘననీయంగా పెరగనుంది.రబీలో 60 నుండి 70 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేశామని మంత్రి తెలిపారు.
గత మూడేళ్లలో వరసగా 40 వేల క్వింటాళ్ల వరకు రబీలో వినియోగించడం జరిగింది.ఈ ఏడాది సాగు ఆశాజనకంగా ఉన్నందున డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నాము. రబీ రాకకు ముందే వేరుశనగ సాగుకు రైతులు సిద్దమవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 21న విత్తనాల కోసం టెండర్లు పిలవడం జరిగింది.తెలంగాణ సీడ్స్ వద్ద 10 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి.మిగతా విత్తనాలను సేకరించడానికి టెండర్లు పిలిచి అధికారులతో సమీక్షించడం జరిగింది అని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.