సఖీ కేంద్రాల ద్వారా మహిళలకు భద్రత- మంత్రి సత్యవతి

261
Satyavati Rathod
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు రాష్ట్రంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని సఖీ కేంద్రాలను అందుకనుగుణంగా బలోపేతం చేస్తామని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హైదరాబాద్ లో షీ-టీమ్స్ వల్ల మహిళల పట్ల దాడులు చేయడానికి భయం కలిగిందని, గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు కూడా షీ టీమ్స్ వలె తయారు కావాలని చెప్పారు. పోలీసు, న్యాయ, వైద్య శాఖలతో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సమన్వయం చేసుకుని ఈ లక్ష్య సాధన కోసం పనిచేస్తుందన్నారు. సమాజంలో, కుటుంబంలో, బయట మహిళలు ఎదుర్కొంటున్న హింస, దాడుల నుంచి మహిళలకు రక్షణ కల్పించి, వారి సమస్య పరిష్కారానికి ఒకే వేదికగా పని చేస్తున్న సఖీ కేంద్రాల రాష్ట్ర స్థాయి సమావేశం నేడు హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి, కమిషనర్ దివ్య, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ డి. ఐ.జీ బడుగుల సుమతి, మహిళాభివృద్ధి శాఖ అధికారులు, జిల్లాల సంక్షేమ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

సమావేశంలో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఇదొక మంచి కార్యక్రమం. చాలా మంచి సలహాలు వచ్చాయి. ఇవి అమల్లోకి వచ్చి లక్ష్యం నెరవేరేలా మనం అందరం కలిసి పని చేద్దాం. మహిళల అన్ని సమస్యలకు పరిష్కార వేదిక సఖీ కేంద్రం అనే ధీమా కల్పించేటట్లు ఈ కేంద్రాలు పని చేస్తున్నాయి. మన దగ్గర ఉన్న మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలోని 64 వేల మంది సైన్యాన్ని మహిళలకు భరోసా కల్పించే విధంగా తయారు చేయాలన్నది ఇపుడు మన ముందు ఉన్న లక్ష్యం. అంగన్వాడీల ద్వారా ఇచ్చే అన్ని సేవలతో పాటు మహిళలకు రక్షణ కల్పించే కేంద్రాలుగా సఖీ సెంటర్లను అభివృద్ధి పర్చాలి. షీ- టీమ్స్ వల్ల నగరంలో మహిళలపట్ల దాడి చేయడానికి పురుషుల్లో కొంత భయం ఏర్పడింది. గ్రామాల్లో మన అంగన్వాడి కేంద్రాలు షి- టీమ్స్ గా పని చేయాలి. దేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ తప్పు చేసిన వారిని వదిలి పెట్టదు అన్న పేరు తెచ్చుకుంది. గతంలో సంఘటన జరిగిన తరవాత పోలీస్ వచ్చే వారు..కానీ ఇప్పుడు 100 కి డయల్ చేసిన వెంటనే వచ్చేవిధంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఉంది. మహిళల పట్ల జరుగుతున్న దాడులు చూస్తున్నప్పుడు మనసు కలచి వేస్తుంది. కానీ మనకు కనపడని దాడులు ఇంకా చాలా ఉన్నాయి. మగ పిల్లలకు వ్యాపకం లేకపోతే మహిళల పట్ల ఎక్కువ దాడులు జరిగే అవకాశం ఉంటుంది. గతంలో ఊర్లలో పోలీస్ పటేల్ వ్యవస్థ ఉండడం వల్ల ఊర్లో చాలా సమస్యలకు అక్కడే పరిష్కారం ఉండేది. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు. అయితే ప్రతి ఊరికి ఒక పోలీస్ ఉండే ఆలోచన చేస్తున్నారు. ఈ పోలీస్ ఊర్లో బలాదురుగా తిరిగే పిల్లలకి కౌన్సెలింగ్ ఇవ్వడం, వారిని సరైన దారిలో పెట్టడం చేస్తారు.

మగ పిల్లల పట్ల తల్లిదండ్రుల దృక్పథం మారాలి. ఇందుకోసం కౌన్సెలింగ్ చాలా ముఖ్యం. ఆడపిల్లలకు చెప్పే జాగ్రత్తల కంటే మగ పిల్లలలకు ఆడపిల్లల విషయంలో ఏ విధంగా వ్యవహరించాలో చెప్పాలి. దాడికి గురైన ఆడపిల్ల పట్ల సానుభూతి అయినా ఉంటుంది…కానీ దాడికి పాల్పడిన అబ్బాయిల పట్ల సమాజంలో తీవ్ర వ్యతిరేకత ఉంటుంది. ఆ కుటుంబం కూడా చాలా చిన్నచూపునకు గురవుతుంది. బాధితులకు మన ఒక రక్షణగా, మద్దతుగా నిలబడే నమ్మకం సఖీ సెంటర్లు కావాలి. మహిళల పట్ల జరిగిన దాడులలో, వాటి పరిష్కారాలలో పోలీసులు ఈ మధ్య మంచి సహకారం అందిస్తున్నారు. అయితే పోలీస్ లకు అందిన సమాచారాన్ని మాకు వెంటనే అందిస్తే మా తరపున బాధితులకు అందించే సాయం మేము తొందరగా ఇచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇద్దరం కలిసి పని చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది.మహిళా ఆదాలత్ లు ప్రతి నెలలో పెట్టాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ ఇద్దాము. భరోసా కేంద్రాలు 33 ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈ సఖీ కేంద్రాలతో వాటిని అనుసంధానం చేయడం వల్ల మహిళకు ఒకే కేంద్రంగా పరిష్కారం దొరుకుతుందని నమ్మకం ఏర్పడుతుంది.సఖీ కేంద్రాలు ఉన్నట్టు మన రాష్ట్రంలో అందరికీ తెలిసేలా ప్రచారం కల్పించడం చాలా ముఖ్యం. 1098, 181 గురించి నెంబర్లు ఎక్కువ మంది కి తెలిసేలా చేయాలి. సఖీ కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది…మీ సలహాలు ఇవ్వండి. సఖీ కేంద్రాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఒక అధికారిని పెట్టాలని ఆలోచిస్తున్నాము. పోలీస్ శాఖ నుంచి కూడా ఒక అధికారిని ఇవ్వాలని, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని ఆలోచిస్తున్నాము.

రాష్ట్రంలో ఉండే మహిళలకు ఏమి చేస్తే వారు సంతోషంగా ఉంటారో చెప్పాలని సీఎం కేసిఆర్ గారు పదే పదే చెప్తారు. సీఎం కేసిఆర్ గారు మహిళల పట్ల ఎక్కువ శ్రద్ద చూపిస్తారు. అందులో భాగంగానే ఆరోగ్య లక్ష్మీ, కేసిఆర్ కిట్, 6 నెలల గర్భిణి గా ఉన్నప్పటి నుంచి ఆరు నెలల పాటు నెలకు 2000 చొప్పున 12 వేల రూపాయలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి ఇంతటి ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం సఖీ కేంద్రాలను బలోపేతం చేస్తాము. మరోసారి పోలీస్, న్యాయ, వైద్య శాఖలతో కలిసి సమావేశం పెట్టుకొని సమర్థ వంతంగా మహిళల కోసం పని చేసేలా కార్యాచరణ రూపొందించుకుందాం. జిల్లా సంక్షేమ అధికారులు అంటే కేవలం అంగన్వాడీ సరుకులు ఇచ్చే వారే కాదు..మహిళల రక్షణ కోసం ఉన్న అధికారులు అన్న నమ్మకం కల్పించాలి. ఇందుకోసం మీకు ఇంకా ఎలాంటి వసతులు కావాలన్నా అందించడానికి సిద్దంగా ఉన్నామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య మాట్లాడుతూ.. ప్రతి రోజు న్యూస్ పేపర్లలో మహిళలపై దాడులకు సంబంధించి వస్తున్న వార్తలు చూసి మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు తీవ్ర బాధపడుతున్నారు. వీటిని ఆపేందుకు మనం ఏమి చేయలేమా? దీనికి పరిష్కారం ఆలోచించే దానిలో భాగంగా నేడు ఈ సమావేశం పెట్టమన్నారు. గృహ హింస ఏమి తెలియకుండా జరుగుతుంది కాదు. పక్కన ఉన్న ఇంట్లో వారికి, గ్రామాల్లో అందరికీ తెలిసే ఈ గృహ హింస జరుగుతుంది. అయితే మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ, న్యాయ శాఖ కలిసి ఈ హింసను తగ్గించాలన్నది ఆలోచన. మహిళల పట్ల జరుగుతున్న కేసులకు సంబంధించి వారిని మన మహిళా ప్రాంగణాలలో పునరావాసం కల్పించి, సాయం చేయాలనుకునే ఆలోచన ఉంది. వారి కేసులలో న్యాయం జరిగే విధంగా న్యాయ సాయం అందించే ప్రణాళిక రూపొందించాలని చర్చించాం. దాడులకు గురవుతున్న వారికి పునరావాసం కల్పించడం, ఉపాధి చూపడం, వారికి న్యాయ సాయం చేయడం వంటి వాటిలో మహిళాభివృద్ధి శాఖ బాధితులకు అండగా ఉండాలని చూస్తోంది . సఖీ కేంద్రాలలోకి వచ్చే వారికి న్యాయం చేయడంలో పోలీసు సహకారం చాలా ముఖ్యం. హోమ్ గార్డ్స్ కేటాయించారు. వీరి వల్ల ఇకపై ఇంకా మంచి ఫలితాలు వస్తాయన్నారు.

ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ డి.ఐ.జీ సుమతి మాట్లాడుతూ…పొక్సో కేసులపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. గృహ హింసపై అవగాహన కల్పించాల్సింది మహిళలకు కాదు పురుషులకు అనేది ముఖ్యం. సీఎం కేసిఆర్ గారు షీ టీమ్స్ వల్ల హైదరాబాద్‌లో భయం ఎలా ఉందో… రాష్ట్రవ్యాప్తంగా అలాంటి భయం కల్పించే విధంగా కార్యాచరణ రూపొందించాలి అన్నారు. ప్రతి నెల రాష్ట్రంలో 220 నుండి 240 కేసులు పోక్సో కేసులు నమోదు అవుతున్నాయి. ఇంకా మన దృష్టికి రానివి చాలా ఉన్నాయి. సఖీ కేంద్రం ఇలాంటి వాటికి మహిళకు భరోసా కల్పించే ఒక చిరు దీపం కావాలి. ప్రతి సఖీ కేంద్రానికి హోమ్ గార్డ్ నీ వెంటనే ఇస్తాము. పోలీస్ శాఖ 100కి 1,51,000 కేసులు వస్తే 52 వేలు మహిళలపై దాడులు, హింసకు సంబంధించినవే. ఈ కేసులు తగ్గాలంటే షరతుల జీవనం నుంచి మొదట మహిళను బయట పడేయాలి. నక్సల్స్ విషయాన్ని ఎదుర్కోవడంలో తెలంగాణ పోలీస్ నంబర్ వన్ ఎలాగో మహిళలపై దాడుల నిరోధంలో కూడా పోలీస్ శాఖ అలా ఉండాలన్నది సిఎం కేసిఆర్ గారి ఆలోచన. ఈ ఆలోచన సాకారం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, మహిళల రక్షణ విషయంలో తెలంగాణను నెంబర్ వన్ గా తీర్చిదిద్దాలన్నది మనందరి లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో స్వధార్ గృహ, ఉజ్వల హోమ్స్, సఖీ కేంద్రాల్లోని సమాచారాన్ని ఆన్ లైన్ లో పర్యవేక్షించే విధంగా రూపొందించిన వెబ్ అప్లికేషన్ ను మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ఆవిష్కరించారు.

- Advertisement -