బీజేపీ నేతల్లారా ఖబడ్దార్.. మంత్రి సత్యవతి హెచ్చరిక..

138
- Advertisement -

దేశంలో, రాష్ట్రంలో రైతులను ఇబ్బండిపెడుతూ రాజకీయం చేస్తున్న బీజేపీ నేతలపై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి, ఎముకలు కొరికే చలిలో రైతులను ఏడాది పాటు ఇబ్బంది పెట్టిన దేశ ప్రధానినే పంజాబ్ లో రైతులు రోడ్డు మీద నిలబెట్టారని, మిగిలిన బీజేపీ నేతలకు కూడా ఇదే గతి పడుతుందని మంత్రి హెచ్చరించారు. బీజేపీ నేతలు నాలుకలు అదుపులో పెట్టుకోకపోతే వారికి పుట్టగతులు ఉండవన్నారు. రైతు బంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి 50వేల కోట్ల రూపాయలను జమ చేసిన సందర్భంగా మహబూబాబాద్ లోని రైతు వేదికలో సంబరాలు నిర్వహించారు. అనంతరం మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతు సంబరాలలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందించారు. అక్కడే మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడం, కాళేశ్వరం వంటి భారీ బహుళసార్థక ప్రాజెక్టు నిర్మించడం, రైతుబంధు, రైతు బీమా పథకాలు పెట్టడం వల్ల తెలంగాణ రైతులు దేశానికి అన్నం పెట్టే స్థాయికి వచ్చారన్నారు. తెలంగాణ రైతుల కల్లాల్లో పుష్కలమైన ధాన్యాన్ని చూసి కండ్లు మండి, ఓర్వలేక బీజేపీ నేతలు తెలంగాణ ధాన్యాన్ని కొనడం లేదని, మా రైతులను ఇబ్బంది పెడుతున్నారని, ఇదే పద్దతి కొనసాగితే బీజేపీకి ఇక్కడ పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.

బీజేపీ నేతలు కొత్త బిచ్చగాళ్ల వలె రాష్ట్రంలో పర్యటిస్తూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, తమ రాష్ట్రంలో గెలువని నేతలు ఇక్కడ వచ్చి కోతలు కోస్తున్నారని మండిపడ్డారు. కొట్లాడి సాధించిన తెలంగాణలో దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు అసాముల వద్దకు వెళ్లి పెట్టుబడి కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండకూడదని సీఎం కేసిఆర్ రైతుబంధు పథకం తీసుకొచ్చారన్నారు. రైతుబంధు పథకం కింద నాలుగు ఏళ్లలో ఎనిమిది దఫాలుగా ఇప్పటికే రైతుల ఖాతాల్లో 50,536 కోట్ల రూపాయలను జమ చేయడం అత్యంత గొప్ప విషయమన్నారు. తెలంగాణ రైతుల తరపున రైతు బిడ్డగా ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. గత నాలుగేళ్లుగా చిన్న రైతుగా ఉన్న తన ఐదెకరాలకు ప్రతిసారి 25వేల రూపాయల చొప్పున ఏడు దఫాలుగా 1,75,000 రూపాయలు వచ్చాయన్నారు.

తెలంగాణలో ఎకరం నుంచి 5 ఎకరాల భూమి ఉన్న రైతులు 90 శాతం ఉంటే, అంతకు మించిన భూమి ఉన్నవారు పది శాతం మాత్రమే ఉన్నారన్నారు. రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా రైతేనని, అందుకే ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ రాష్ట్రంలో ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉండాలని రైతుబంధు అందరికీ ఇస్తున్నారని, దీనిని అర్థం చేసుకోవాలని విజ్ణప్తి చేశారు. రైతుబంధు, ఉచిత కరెంటు, సాగునీటి ప్రాజెక్టుల వల్ల నేడు మహబూబాబాద్ లో కూడా ధాన్యం దిగుబడి బాగా పెరిగిందన్నారు. తెలంగాణ రాకముందు 1.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే..ఇప్పుడు అది 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పడుతుందన్నారు. రైతుబంధు కింద మొదట్లో 1,28,000 మంది ఉంటే…1,80,000 మందికి పెరిగారన్నారు. రైతుబంధు మొత్తం కూడా 125 కోట్ల రూపాయల నుంచి 220 కోట్ల రూపాయలకు పెరిగిందన్నారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ వల్లె తెలంగాణ నేడు సస్యశ్యామలంగా ఉందన్నారు. ఎండాకాలంలోనూ చెరువులు మత్తడి పోస్తున్నాయని తెలిపారు. గతంలో బాబ్లీ వద్ద ప్రాజెక్టులు అక్రమంగా నిర్మిస్తుంటే ఎస్.ఆర్.ఎస్.పి ఏడారి అవుతుందని, నేను కూడా బాబ్లీకి వ్యతిరేకంగా పోరాడానన్నారు. అయితే కేసిఆర్ దీర్ఘదృష్టి వల్ల నేడు తెలంగాణలో కాళేశ్వరం వంటి ప్రాజెక్టు కట్టి నీటిని ఎగువకు పారిస్తున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పథకాలను ప్రశంసిస్తూ ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోతే రాష్ట్ర బీజేపీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పొలవరానికి నిధులు ఇస్తూ మూడేళ్లలో నిర్మించి లక్షల ఎకరాలకు నీళ్లు అందించే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటే అతీ, గతి లేదన్నారు. కనీసం రైతులకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వడం లేదన్నారు.

తెలంగాణ రైతులు, ప్రజలు విజ్ణులని, ఇక్కడ లాభాసాటి వ్యవసాయం కోసం పంటి మార్పిడి చేస్తున్నారని, ఇక్కడి రైతులను రెచ్చగొడితే ప్రధానికి పట్టిన గతే మీకు పడుతుందన్నారు. రైతు బాగు కోసం నిత్యం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి తెలంగాణ రైతులు బాసటగా నిలువాలని కోరారు. రైతుల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచేందుకే ఈ రైతుబంధు సంబరాలు చేస్తున్నామన్నారు. రైతు కోసం ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ప్రజలందరికీ తెలియజేయడమే దీని ఉద్దేశ్యమన్నారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి కేసిఆర్ రైతుబంధు పథకం పెట్టి రైతుల ఖాతాల్లో 50వేల కోట్ల రూపాయలు వేశారన్నారు. గతంలో పాలించిన ఏ పార్టీలు చేయని కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం చేస్తుందన్నారు. బీజేపీ ఏమి చేసింది ప్రజలు చూశారని, రాబోయే రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్ కు గడ్డపారతో వాతలు పెడుతారని హెచ్చరించారు. ప్రతి వర్గం గురించే ఆలోచించే భారత దేశ ఐకాన్ లీడర్ మన సీఎం కేసిఆర్ గారన్నారు.

ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల్లో రైతులు నాన కష్టాలు పడితే…ఈ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి ఎకరానికి 10 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయంగా 50వేల కోట్లు ఇచ్చిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అయితే ఒకేరకమైన పంట వేయడం ద్వారా రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు కాబట్టి ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళాలని కోరారు. ధాన్యం గిట్టుబాటు ధర కేంద్రం పరిధిలో ఉండగా, కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. రైతు ఆత్మ గౌరవ వేదికలుగా ఈ రైతు వేదికలు నిర్మించారన్నారు. మహబూబాబాద్ జిల్లా ఎక్కువ వ్యవసాయం చేసే జిల్లా అని, రైతు జిల్లా అని అభివర్ణించారు. ఇక్కడి రైతు సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు.

మహబూబాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు మాట్లాడుతూ.. నీళ్ళు, నిధులు, నియామకాలు లక్ష్యంగా సాధించుకున్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రాజెక్టులు నిర్మించి, ఉచిత కరెంటు ఇచ్చి, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో వ్యవసాయాన్ని పండగ చేశారన్నారు. పెట్టుబడి సాయం కింద రైతు బంధు పథకం పెట్టి 50 వేల కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో వేయడం ప్రపంచంలోనే అత్యంత గొప్ప కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ శశాంక, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, అగ్రికల్చర్ జేడీ చత్రు నాయక్, పాక్స్ చైర్మన్ రంజిత్, కో ఆప్షన్ సభ్యులు పాషా, ఇతర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -