కరోనా కట్టడికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి..

58
Minister Satyavathi Rathod

రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని పరిస్థితులను ఆయా జిల్లా కలెక్టర్లు, అధికారులతో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కోవిడ్‌ నియంత్రణకు జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామస్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి. ప్రజలకు కరోనా వ్యాప్తి, నివారణ, చికిత్సలపై అవగాహన కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే జరుగుతున్న నేపథ్యంలో జ్వరం ఉన్నట్లు తేలితే వెంటనే వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని మంత్రి తెలిపారు. తగిన చికిత్స అందించాలని సూచించారు. ఇందుకోసం అవసరమైన మందులు, వైద్య సిబ్బంది, బెడ్స్ కొరత లేకుండా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ.. నివేదికలు రూపొందించి పంపించాలని మంత్రి ఆదేశించారు. కొవిడ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని, వారిని భాగస్వామ్యం చేయాలని సూచించారు. కరోనా బారిన పడి ఇంట్లో ఎవరూ లేని తల్లిదండ్రుల పిల్లల సంరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా చైల్డ్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామన్నారు.

ఎవరైనా తల్లిదండ్రులకు కరోనా వచ్చి పిల్లలు ఒంటరిగా ఉండే పరిస్థితి వస్తే..వారిని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ట్రాన్సిట్ హోమ్స్ లలో పెట్టి అవసరమైన వసతులను కల్పించి సంరక్షించాలని చెప్పారు. జిల్లాలో కరోనా బారిన పడ్డ తల్లిదండ్రుల పిల్లల్ని ఇంటి దగ్గర నుంచి ట్రాన్సిట్ హోమ్ కు తీసుకురావడానికి ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో వెంటనే ఉత్తర్వులు అమలు చేసి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. కొవిడ్ విషయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే 24 గంటలు తాను అందుబాటులో ఉంటాను. వెంటనే సమస్యను తన దృష్టికి తీసుకురావాలని, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని మంత్రి తెలిపారు.