అమ్మాయిల భద్రతకు అత్యంత ప్రాధాన్యత: మంత్రి సత్యవతి

221
Minister Satyavathi Rathod
- Advertisement -

విద్యాపరంగా, సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నా… సమాజంలో ఇంకా బాల్యవివాహాలు జరుగుతుండడం దురదృష్టకరమని, దీనివల్ల ఆడపిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందని, ఈ బాల్యవివాహాలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

తెలంగాణను బాల్యవివాహాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పైలట్ ప్రాజెక్టుగా మహబూబాబాద్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పారు. బాల్యవివాహాల నిర్మూలనపై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జిల్లా అధ్యక్షురాలు నాగరాణి, మహిత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సుదర్శన్, ఇతర అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్ నేడు హైదరాబాద్ నుంచి వెబినార్ నిర్వహించారు.

సమావేశంలో మంత్రి సత్యవతి మాట్లాడుతూ… ‘‘మహబూబాబాద్ జిల్లా ఎక్కువగా గిరిజనులు, పేదవాళ్లు ఉన్న ప్రాంతం. ఆడపిల్ల ఇంట్లో ఉంటే భద్రత, పోషణ విషయంలో పేదలకు అనేక ఇబ్బందులు ఉంటాయి. ఆలస్యమయ్యే కొద్ది సరైన సంబంధం దొరకకపోవచ్చనే భయం ఉంటుంది. అందుకే సిఎం కేసిఆర్ 18 ఏళ్లు నిండిన తర్వాత అమ్మాయికి పెళ్లి చేయడాన్ని ప్రోత్సహించే విధంగా వారి తల్లిదండ్రులకు ఆర్ధిక సాయంచేసే కళ్యాణ లక్ష్మీ తీసుకొచ్చారు.

నేను పెళ్లి చేసుకున్న కాలంలో కూడా ఉపాధ్యాయులు అమ్మాయిలు బాగా చదువుతున్నారు, పెళ్లి చేయవద్దని తల్లిదండ్రులకు చెప్పేవారు. కానీ ఈ కాలంలో అన్ని అవకాశాలు, సాంకేతికత పెరిగినా అవగాహన కల్పించడం సరిగా జరగడం లేదు. అయితే బాల్యవివాహాలను నియంత్రణ చేయకుండా చివరి నిమిషంలో పెళ్లి ఆపడం వల్ల ఆ కుటుంబంపై ఆర్ధికంగా భారం పడడంతో పాటు అనేక ఇబ్బందులుంటాయి. కాబట్టి బాల్యవివాహాలపై అవగాహన కల్పించాలి. బాల్యవివాహాలు జరిపించే పరిస్థితులను అర్థం చేసుకుని, వాటి పరిష్కారం వైపు మన ప్రయత్నాలు ఉండాలి. బాల్య వివాహాలను మొదటి స్థాయిలోనే నివారించేందుకు చర్యలు తీసుకోవాలి.

కోవిడ్ వల్ల పాఠశాలలు, కాలేజీలు లేనందున ఇంటి దగ్గర అమ్మాయిలు ఎలా ఉంటున్నారనేది పర్యవేక్షణ ఉండాలి. గ్రామాల్లో పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం, కోవిడ్ నియంత్రణ, కట్టడిపై ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నాం…ఇదే పద్దతిలో బాల్యవివాహాలు నేరమనే అవగాహన విస్తృతంగా కల్పించాలి. గ్రామాల్లో అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మతపెద్దలకు ఈ బాల్యవివాహాలు నేరమనే చైతన్యం కల్పించాలి. దేవాలయాలు, చర్చిలు, మసీదులు, ప్రజలు గుమికూడే ప్రాంతాల్లో బాల్యవివాహాలపై పోస్టర్లు వేయాలి. బాల్యవివాహంలో ఆడపిల్ల తల్లిదండ్రుల మీద కంటే అబ్బాయి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కఠిన శిక్షలు ఉంటాయని, జీవితం ఇబ్బందుల పాలు అవుతుందని అవగాహన కల్పించాలి’’ అన్నారు.

- Advertisement -