అంగన్ వాడీలలో కిచెన్ గార్డెన్స్ : మంత్రి సత్యవతి

184
sathyavathi rathod

ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలు, శిశువుల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, మహిళలు, శిశువుల విషయంలో ఎలాంటి దాడులు జరిగినా దోషులను వదిలే ప్రసక్తి లేదని, కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తెలిపారు.

ఇటీవల అమీన్ పూర్ సంఘటన, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఒక మహిళ తనపై 139 మంది అత్యాచారానికి పాల్పడ్డారని ఇచ్చినటువంటి ఫిర్యాదులు, మహిళలపై దాడులు జరిగితే వెంటనే తీసుకోవాల్సిన చర్యలు, దాడులు జరగకుండా చేపట్టే నివారణ చర్యలు, అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల ఆరోగ్య పరిరక్షణ చర్యలపై నేడు మహిళా- శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ లో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, కమిషనర్ శ్రీమతి దివ్య ఇతర అధికారులు జిల్లాల సంక్షేమ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

అమీన్ పూర్ సంఘటన నేపథ్యంలో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న మహిళలు, బాలల సంరక్షణ కేంద్రాలపై తనిఖీ చేయాలని ఈ నెల 21వ తేదీన మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. ఈ నెలాఖరులోపు ఈ సంస్థలలో తనిఖీలు చేసి, నివేదిక సమర్పించాలన్నారు. దీనిపై ప్రస్తుతం జరుగుతున్న తనిఖీల తీరు, ఆ సందర్భంగా అధికారుల దృష్టికి వస్తున్న అనుభవాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి అడిగి తెలుసుకున్నారు.

అనాథ ఆశ్రమాలకు పంపించే పిల్లల కుటుంబాల వద్దకు వెళ్లి వారిని ఆశ్రమాల్లో చేర్పించడానికి గల కారణాలను తెలుసుకోవాలన్నారు. తల్లిదండ్రులు ఉండి పిల్లలను ఆశ్రమాలలో చేర్పిస్తే, ఆ కుటుంబానికి ఉన్న ఇబ్బందులను గుర్తించాలన్నారు. ఆశ్రమాలలో చేర్పించే పిల్లల విషయంలో ఆరేళ్లు దాటిన వారు అయితే గురుకులాల్లో చేర్పించి సంరక్షించాలని, ఆరేళ్లలోపు వారయితే అంగన్వాడీల ద్వారా కావల్సిన సహకారం వారికి అందించాలని సూచించారు.

హోమ్స్ నిర్వాహకులు వాటిని నడపడానికి గల కారణాలు కూడా లోతుగా విశ్లేషించాలని, సామాజిక సేవ పేరుతో పిల్లలను, మహిళలను ఆశ్రమాలలో పెట్టి ఇబ్బందులు పెడుతున్నట్లు దృష్టికి వస్తే వెంటనే ఆ ఆశ్రమాలను మూసివేసి, నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.

   సెప్టెంబర్ నెలను పోషణ మాసంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో అంగన్ వాడీ కేంద్రాలలోని పిల్లలు, తల్లులు, బాలింతల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని మంత్రి చెప్పారు. ఎప్పటికప్పుడు పిల్లల బరువులను కొలిచి నివేదిక సమర్పించాలన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి అంగన్ వాడీ కేంద్రంలో కిచెన్ గార్డెన్ పెంచాలని, ఇందుకు కావల్సిన సహకారం అందిస్తామని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ గారు పెట్టిన ఆరోగ్య లక్ష్మీ పథకం కింద అంగన్ వాడీ కేంద్రాలలో మంచి ఆహారాన్ని ఇస్తున్నామని, ఈ కిచెన్ గార్డెన్స్ వల్ల మరింత తాజా కూరగాయలు, ఆకుకూరలతో భోజనం అందించవచ్చన్నారు. ప్రతి అంగన్ వాడీ కేంద్రంలో స్థానిక అంగన్ వాడీ అధికారి ఫోన్ నెంబర్ల తో పాటు 100, 108, 181 నెంబర్లు, స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారుల నెంబర్లు కూడా ప్రదర్శించాలన్నారు.

మహిళా సమస్యలకు పరిష్కారం ఇచ్చే సఖీ కేంద్రాలలో మహిళా – శిశు సంక్షేమ శాఖ అధికారిని నియమించాలని నిర్ణయించాము. వీరితో పాటుస్థానిక ఏసీపి కూడా దానిని పర్యవేక్షించేలా చూసే ప్రయత్నం చేస్తున్నాము. సఖీ కేంద్రాలలో ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి, వాటి పరిష్కారం ఏ విధంగా ఉందనేది మహిళా – శిశు సంక్షేమ శాఖ అధికారి ఎప్పటికప్పుడు రిపోర్టు చేయాలి.

దత్తత తీసుకునే అంశంపై కూడా విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి సూచించారు. చాలామంది దీనిపై అవగాహన లేకుండా దత్తత కోరుతున్నారన్నారు. కొంతమంది దత్తత తీసుకుని పిల్లలను సరిగా చూసుకోవడం లేదని, అందుకోసం దత్తత ఇచ్చేటప్పుడు తీసుకునే వారిపై సమగ్ర విచారణ చేసుకోవాలన్నారు.    మహిళా – శిశు సంక్షేమ శాఖ పరిధిలోని ప్రతి చోట మహిళలు, శిశువుల సంరక్షణకు మేమున్నామనే భరోసా ఇచ్చే విధంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని కోరారు.