కామారెడ్డి జిల్లా, గాంధారి మండలంలోని గిరిజన తండాకు చెందిన ఒక మైనర్ బాలిక శిశువుకు జన్మనిచ్చి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి దోషులను పట్టుకుని చట్ట పర చర్యలు తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. బాలిక కుటుంబానికి సంతాపం తెలిపారు. ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా ఉంటుంది అని ధీమా కల్పించారు.
మంత్రి ఆదేశాల మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వెళ్లి విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఆనంతరం శిశువును హాస్పిటల్ లో చేర్పించి, పర్యవేక్షిస్తున్నామని, శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకొంటానని చెప్పి మోసం చేసి, గర్భవతిని చేసినట్లు భావిస్తున్నాం అన్నారు. త్వరలోనే దోషులను పట్టుకుని తగిన శిక్ష పడేలా చేస్తామన్నారు.