ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) పరిధిలోని హైదరాబాద్ నగర శివారు గ్రామాలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల ప్రజలకు తాగునీటిని అందించేందుకు చేపడుతున్న ఓఆర్ఆర్ ఫేజ్ 2లోని ప్యాకేజ్ – 2 పనులకు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోమవారం శంకుస్థాపన చేశారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపూర్ టౌన్ షిప్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… దేశంలోనే వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో హైదరాబాద్ ముందుందని, మన నగరానికి ఉన్న భౌగోళిక, వాతావరణ అనుకూల పరిస్థితుల కారణంగా వేగంగా విస్తరించడంతో పాటు జనాభా పెరుగుతోందన్నారు. నగర ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా కేసీఆర్ ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోందన్నారు. మొదటి దశలో జీహెచ్ఎంసీ పరిధిలో రూ.2 వేల కోట్లతో మెరుగైన నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ అంటే మొత్తం ఓఆర్ఆర్ పరిధిగా తాము భావిస్తున్నామని, అందుకే ఈ ప్రాంతంలో కూడా తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఓఆర్ఆర్ పరిధిలో మొదటి విడతలో రూ.775 కోట్లతో తాగు నీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పుడు ఫేజ్ – 2లో భాగంగా ఏకంగా 1,200 కోట్ల నిధులతో ఓఆర్ఆర్ పరిధి మొత్తానికి తాగునీటిని అందించే బృహత్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
మంత్రి సబిత ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… ప్రస్తుత జనాభాతో పాటు భవిష్యత్‌లో పెరగనున్న జనాభాకు తగ్గట్లుగా అభివృద్ధి జరగాలనే ముందుచూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తారని పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్ శివారు ప్రాంతాలకు జీహెచ్ఎంసీ ప్రాంతం నుంచి కష్టపడి నీటిని తరలించాల్సి వచ్చేదని, ఇప్పుడు మాత్రం ఓఆర్ఆర్ పరిధిలోని ప్రాంతాలకు నీటిని అందించేందుకు మన ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. హైదరాబాద్ అంటే కేవలం జీహెచ్ఎంసీ అని ప్రభుత్వం భావించడం లేదని, ఓఆర్ఆర్, హెచ్ఎండీఏ పరిధి మొత్తాన్ని నగరంగా భావించి అభివృద్ధి చేస్తోందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మౌళిక సదుపాయాలకు సీఎం కేసీఆర్ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.
జలమండలి ఎండీ దానకిశోర్ మాట్లాడుతూ.. నగర ప్రజలకు తాగునీటిని అందించేందుకు జలమండలికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందన్నారు. గతంలో ఒక్క ఏడాదిలో గరిష్ఠంగా సుమారు వెయ్యి కోట్ల రూపాయల పనులు జరిగేవని, ఇప్పుడు మాత్రం ఒక్క ఏడాదిలో రూ.8 వేల కోట్ల పనులను జలమండలి చేస్తోందని పేర్కొన్నారు. మూడు నెలల్లోనే ఓఆర్ఆర్ ఫేజ్ – 2 ద్వారా నీటి సరఫరా అందించే లక్ష్యంతో పని చేస్తున్నట్లు చెప్పారు. 3 షిఫ్టుల్లో వేగంగా పనులు జరిపి ప్రజలకు నీటిని అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే నగరానికి వాటర్‌ప్లస్ సిటీ అవార్డు వచ్చిందని, ఇప్పుడు శివారు ప్రాంతాలకు కూడా వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజీత్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, సురభి వాణిదేవి, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ అనితా హరినాథ్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, మణికొండ మున్సిపల్ ఛైర్మన్ నరేందర్, వైస్ ఛైర్మన్ నరేందర్రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, జలమండలి అధికారులు పాల్గొన్నారు.