పేద, మధ్యతరగతి ప్రజలపై పెను భారంగా మారుతున్న గ్యాస్ ధర పెంపుదలకు నిరసనగా ఆదివారం (మే 15న) మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బాలాపూర్ చౌరస్తాలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. స్వల్ప కాలంలోనే రెండు మార్లు 50 రూపాయల చొప్పున సీలిండర్ ధర పెంచి పేద, మధ్యతరగతి ప్రజల వంటింట్లో కష్టాలు తెచ్చిన కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై నేడు మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మంత్రి అన్నారు.
ఎనిమిదేళ్ల కిందట 400 రూపాయలు ఉన్న వంట గ్యాస్ సిలిండర్ ధర.. నేడు 1052 రూపాయలకు పెంచిన ఘనత కేంద్ర బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానం చూస్తుంటే మహిళలు మళ్ళీ కట్టెల పొయ్యి పై వండి, కన్నీరు కార్చాలని ఉన్నట్లు ఉందని, ప్రపంచంలోనే అధిక గ్యాస్ ధర మన దేశంలోనే ఉందని మంత్రి పేర్కొన్నారు. ఆదివారం నాడు బాలాపూర్ చౌరస్తాలో సిలిండర్ ధరల పెంపుపై భారీ ధర్నా చేపడుతున్నట్లు, ఢిల్లీకి వినిపించేలా మహిళలు గర్జిస్తారని అన్నారు. ఈ మహాధర్నా కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.