రోజు రోజుకు పెరిగి పోతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. రవాణా శాఖ నుంచి కూడా ప్రత్యేక చొరవ తీసుకోవాలని, ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. సిబ్బంది, ఉద్యోగులు కోనుగోలు చేయడమే కాకుండా వారి వారి బంధువులకు కూడా ఎలక్ట్రికల్ వాహనాల ప్రాధాన్యతను వివరించాలని చెప్పారు.
శనివారం ఖైరతాబాద్ లోని రవాణా శాఖా కార్యాలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రవాణా శాఖ అధికారులతో కలిసి కేక్ కట్ చేసి ఉద్యోగులందరికీ శుభాభినందనలు తెలిపారు మంత్రి. టి.ఆర్ అండ్ బి కార్యదర్శి శ్రీనివాస రాజు, రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు, ప్రత్యేక కార్యదర్శి (టి,ఆర్ అండ్ బి) విజేంద్ర బోయి, తదితర ఆర్టీఏ అధికారులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో మంత్రి మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చే శాఖల్లో రవాణా శాఖ ఒకటని, రాబోయే రోజుల్లో మరింత లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని మంత్రి సూచించారు. అదేవిధంగా రవాణా విభాగంలో ఏ వ్యక్తి కార్యాలయానికి రాకూడదనే ఉద్దేశంతో ఆన్లైన్ ద్వారా సేవలు అందుబాటులోకి వచ్చాయని, క్రమంగా వినియోగదారుల సేవల్ని మరింత విస్తరించడంతో ముఖ్య మంత్రి లక్ష్యం త్వరలో నెరవేరుతుందని తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
ఈ మేరకు అధికారుల, ఉద్యోగుల సహకారంతో పాటు సృజనాత్మక ఆలోచనలు అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో ఇంకా 10 నుంచి 12 దాకా ఆన్‌లైన్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావడానికి సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోవిడ్ సమయంలో రవాణా శాఖ ప్రజలకు అందించిన సేవలు అభినందనీయమని, ట్యాంకర్ల ద్వారా ఆక్సిజన్ సరఫరా, డ్రైవర్ల అందరికీ వాక్సినేషన్ ఏర్పాటు వంటి చర్యలు మంచి ఫలితాలను ఇచ్చాయని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితులను తట్టుకుని రవాణా శాఖ సిబ్బంది, అధికారులు తమ విధుల్ని నిర్వహించడం ప్రశంసనీయమన్నారు మంత్రి పువ్వాడ.
రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు మాట్లాడుతూ.. గత సంవత్సరం అన్ని శాఖలు చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాయని, ఈ సమయంలో సేవా దృక్పధంతో అధికారులు పలు రకాల చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మంత్రి ప్రోత్సాహం, ప్రభుత్వ సహకారం మరువలేనిది. రవాణా శాఖ లక్ష్యాలను అధిగమించే దిశలో అందరి ప్రయత్నం అవసరమని, ప్రభుత్వ సహకారం, మంత్రి ప్రోత్సాహంతో శాఖ అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు తెలిపారు.
కరోనా సమయంలో మంత్రి మార్గనిర్ధేశంలో మెరుగైన సేవలు అందించడం జరిగిందని, సిబ్బంది పూర్తి సహకారం మరవలేదన్నారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే రవాణా శాఖ ఈ ఏడాది మరింత పురోభివృద్ధి కోసం మా వంతు పాత్ర పోషిస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు మమతా ప్రసాద్, రమేశ్, పాపారావు, పాండురంగ నాయక్, రామచందర్, తదితరులు పాల్గొని మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.