భారీ మెజారిటీయే లక్ష్యంగా TRS వ్యూహం..

60
kavitha

అక్టోబర్ 9న జరగనున్న నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందేందుకు పకడ్బందీ వ్యూహం రచించింది టిఆర్ఎస్ పార్టీ. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా గెలిచేందుకు టిఆర్ఎస్ కు సంపూర్ణంగా బలం ఉంది. అయితే భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించాలని భావిస్తున్న టిఆర్ఎస్ పార్టీ, అందుకు తగ్గట్టే వ్యూహాలు రచిస్తోంది. ఉప ఎన్నికలకు సంబంధించిన అన్ని విషయాలను మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులతో మంత్రి ప్రశాంత్ రెడ్డి వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం రోజు హైదరాబాదులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి ప్రశాంత్ రెడ్డి సమావేశమయ్యారు. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సైతం పాల్గొన్న ఈ సమావేశంలో, ఎన్నికల కార్యాచరణ, బాధ్యతల నిర్వహణ గురించి చర్చించారు. తాజాగా మంగళవారం రోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎంపీలు సురేష్ రెడ్డి, బిబి పాటిల్ ఎమ్మెల్సీలు రాజేశ్వర్ రావు,విజి గౌడ్,ఆకుల లలిత,జెడ్పి చైర్మన్ విఠల్ రావు,మాజీ చైర్మన్ దఫెదర్ రాజు మంత్రి ప్రశాంత్ రెడ్డి భేటీ అయ్యారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 824 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో అధికార టీఆర్ఎస్ పార్టీ నుండి 505 మంది గెలుపొందగా, కాంగ్రెస్ 140, బిజెపి 84, ఎంఐఎం 28, స్వతంత్ర 66 మంది ఉన్నారు. అయితే ఎన్నికల అనంతరం స్వతంత్ర సభ్యులతోపాటు, కాంగ్రెస్ బిజెపి లకు చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో 80 శాతం మంది స్థానిక ప్రజాప్రతినిధుల టిఆర్ఎస్ కు మద్దతుగా ఉన్నారు.

దీనికి తోడు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యాక, ఇతర పార్టీలకు చెందిన పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు కవితమ్మ అభ్యర్థుత్వానికి మద్దతుగా టీఆర్ఎస్ నేతలతో టచ్ లోకి వస్తున్నారు. దీంతో పోలింగ్ తేదీ నాటికి టిఆర్ఎస్ కు 90 శాతం మంది స్థానిక ప్రజాప్రతినిధులు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే పోలింగ్ పూర్తయ్యేవరకు ఏమాత్రం ఏమరుపాటుగా ఉండకూడదని టిఆర్ఎస్ నేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా నేతలకు బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు పోలింగ్ తేదీ లోపే ఓటర్లందరికీ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగే తీరుపై అవగాహన కల్పించాలని నేతలు అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనప్పటికీ, అక్టోబర్ 9 న జరిగే ఎమ్మెల్సీ ఉపఎన్నికలలో మాజీ ఎంపీ కవిత భారీ మెజారిటీతో గెలిచి, చరిత్ర సృష్టించడం ఖాయమంటున్నారు ఇందూరు గులాబీ నేతలు.