రైతు వేదికను ప్రారంభించిన మంత్రి వేముల..

44
Minister Prashanth Reddy

రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.పచ్చల నడ్కుడ గ్రామంలో రైతువేదిక, పల్లె ప్రకృతి వనంను ప్రారంభించిన మంత్రి. ప్రకృతి వనంలో మొక్కలు నాటి అక్కడే ఏర్పాటు చేసిన బుద్ధుని విగ్రహాన్ని గ్రామస్థులతో కలిసి ఆవిష్కరించారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు.. పల్లెల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలనే పల్లె ప్రకృతి వనం లాంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారన్నారు. దేశానికి పట్టు కొమ్మలు పల్లెలని ఆ పల్లెలను ఆర్థిక పరిపుష్టం చేయాలని సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు,రైతుల సంక్షేమమే ముఖ్యమని తెలిపారు. రైతులను సంఘటితం చేసేందుకు రైతు వేదికల నిర్మాణం చేపట్టారన్నారు.

రైతులకు దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల ఉచిత కరెంట్,ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు, పెట్టుబడికి రైతు బంధు, దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే రైతు భీమా లాంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ ప్రవేశపెట్టారని మంత్రి గుర్తు చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాలకు తావు ఇవ్వకుండా తెలంగాణ అభివృద్దే అజెండాగా పనిచేస్తుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.