రాయగిరి సమీపంలోని ఆంజనేయ అరణ్యంలో అటవీ పునర్జీవ చర్యల్లో భాగంగా గుట్టల ప్రాంతంలో (నాటిన సెర్మోనియల్ / రాకీ) ప్లాంటేషన్‌ను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి సోమవారం పరిశీలించారు. అనంతరం వారు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. తెలంగాణలో క్షీణించిన అడవుల పునరుద్దరణ, పచ్చదనం పెంచాలనే సీఎం కేసీఆర్ హరిత సంకల్పానికి అనుగుణంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నామని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి తెలిపారు.
హరితహారం కార్యక్రమం వల్ల ప్రజల్లో అవగాహన పెరిగిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల రాష్ట్రంలో 4 శాతం పచ్చదనం పెరిగిందన్నారు. పర్యావరణ సమతుల్యతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందన్నారు. అడవుల పునర్జీవం, ప్రత్యామ్నాయ అడవుల పునరుద్దరణ, హరితహారం కార్యక్రమాల వల్ల యాదాద్రి – భువనగిరి జిల్లాలో పచ్చదనం పెరిగిందని, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం పునఃప్రారంభం తర్వాత ఈ ప్రాంతం మరింత కళకళలాడుతుందని పేర్కొన్నారు.