అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులు, శాఖ ముఖ్య కార్యదర్శులతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్ లోని ఎన్ఎసీ నుండి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై రాష్ట్ర సమస్యలు వెల్లడించారు. గన్నీ బ్యాగుల కొరత తీర్చండి..బత్తాయి రైతుల సమస్యలు పరిష్కరించండి అని కేంద్ర మంత్రిని రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో చేసిన సూచనల మేరకు కొనుగోళ్ల మూలంగా కరోనా వ్యాధి ప్రబలకుండా రాష్ట్రంలోని పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాలు, ఇతర ప్రధాన కేంద్రాలలో వ్యవసాయ మార్కెట్లన్నీ మూసివేశామన్నారు. గన్నీ బ్యాగుల అంశం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే ప్రధానమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆలస్యం చేస్తే తీవ్ర ఇబ్బందులు వస్తాయి వెంటనే ఈ సమస్య పరిష్కరించాలి.
వ్యవసాయ మార్కెట్లలో రైతుల రద్దీ పెరిగితే కరోనా వైరస్ ప్రబలుతుందని గ్రామాలలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ధాన్యం కొనుగోళ్లను ఎక్కడికక్కడ చేపట్టేందుకు రాష్ట్రంలో 7077 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు. లోడింగ్, అన్ లోడింగ్ విషయంలో హమాలీల కొరత, కోతల విషయంలో వ్యవసాయ కూలీల కొరత వేధిస్తుంది. ఈ సమస్య అధిగమించేందుకు కేంద్రం తోడ్పాటు అందించాలి. ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకువచ్చారు. ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలి. వరి కోతలన్నీ దాదాపు యంత్రాల మీదే ఆధారపడి జరుగుతున్నాయి. అందువల్ల కొనుగోలు కేంద్రాలకు పెద్ద ఎత్తున ధాన్యం రావడం మొదలయింది. రైతులకు కూపన్లు అందజేసి కొనుగోలు కేంద్రాలలో రద్దీ లేకుండా దశల వారీగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని నిరంజన్‌రెడ్డి తెలిపారు.
తెలంగాణలో 40 లక్షల ఎకరాల నుండి కోటి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అసాధారణ రీతిలో మార్కెట్ల కు పోటెత్తనుంది. ధాన్యం నూర్పిడి యంత్రాల నుండి కొనుగోళ్ల వరకు ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. బత్తాయి కొనుగోళ్లు ప్రధానంగా ఢిల్లీ మార్కెట్ మీద ఆధారపడి ఉన్నాయి. కేంద్రం బత్తాయి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి, పరిష్కారాలు సూచించాలి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా రాబోయే ఖరీఫ్ లో రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులు అవసరానికి సరిపడా రుణాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలి అన్నారు.
కరోనా వైరస్ మూలంగా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు మార్కెట్లకు పోటెత్తకుండా 300 వాహనాలతో హైదరాబాద్ లో 500 పైచిలుకు ప్రదేశాలలో ప్రతిరోజూ మొబైల్ రైతుబజార్లతో కూరగాయలు, పండ్లు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఈ విషయంలో ప్రజలు గుమికూడకుండా ప్రభుత్వం చేసిన ప్రయోగం ఫలించింది. విత్తన సరఫరాకు సంబంధించి అంతరాష్ట్ర సమస్యలున్నాయి. వాటిని కేంద్రం చొరవ తీసుకుని పరిష్కరించాలి. విత్తన ప్యాకేజీకి సంబంధించిన సామాగ్రి సింగపూర్ లో చిక్కుకుపోయింది. కేంద్రం దాన్ని పరిష్కరించకుంటే రాబోయే ఖరీఫ్ లో రైతులకు విత్తనాల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని మంత్రి సూచించారు. మొబైల్ రైతు బజార్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ చర్యలను ప్రశంసించింది కేంద్రం.