మంగళవారం సూర్యాపేట జిల్లాలో కేసారం గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం, రైతువేదికను ప్రారంభించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, సివిల్ సప్లై చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ వ్యాప్తంగా వానాకాలంలో 53.25 లక్షల ఎకరాలలో వరి సాగయితే, యాసంగిలో 52.80 లక్షల ఎకరాలలో వరి సాగయింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వానాకాలంలో 10.07 లక్షల ఎకరాలలో వరి సాగయితే, యాసంగిలో 11.48 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. వానకాలం సాగును యాసంగి సాగు అధిగమించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఆరున్నరేళ్లలో తీసుకున్న వ్యవసాయ అనుకూల నిర్ణయాలే కారణమని మంత్రి తెలపారు.
ఒక్క కేసారం గ్రామానికి ఈ యాసంగికి రైతుబంధు కింద 977 మంది రైతులకు రూ.88.52 లక్షలు ఖాతాలలో జమ చేశాం. వరి సాగు నుండి రైతులు ఇతర పంటల వైపుకు మళ్లాలి. మిరప పంటకు ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్ ఉంది. రైతులకు వ్యవసాయ విజ్ఞానాన్ని రైతువేదికల ద్వారా వ్యవసాయ శాఖ అధికారులు అందజేయాలి.సూర్యాపేటలో దాదాపు 2 వేల ఇళ్లలో మిద్దెతోటల పెంపకం అభినందనీయం. రైతులు కంది సాగు మరింత పెంచాలి.. డిమాండ్‌కు తగిన ఉత్పత్తి లేక ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. దొడ్డు వడ్లను రైతులు సాగు చేయొద్దు. భవిష్యత్‌లో అమ్ముడుపోయే అవకాశాలు లేవు. భిన్నమైన పంటల వైపు రైతులు దృష్టి సారించాలి. ఆయిల్ పామ్ సాగుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా అనుకూలంగా ఉంది. అధికారులు రైతులను క్షేత్ర పర్యటనకు తీసుకెళ్లి ఆయిల్ పామ్ సాగుపై అవగాహన పెంచాలి. ఆయిల్ పామ్ సాగులో సూర్యాపేటతో వనపర్తి జిల్లాను పోటికి తీసుకుంటున్నాం.. నాలుగేళ్లలో ఏ జిల్లాలో ఎక్కువ సాగవుతుందో చూద్దాం అని మంత్రి అన్నారు.
భవిష్యత్‌లో ఆడపిల్లలు అభ్యుదయ రైతునే పెళ్లి చేసుకుంటాను అనే రోజు వస్తుంది రాసిపెట్టుకోండి.. శాస్త్ర విజ్ఞానం ఎంత పెరిగినా అన్నానికి, వ్యవసాయ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయం లేదు.. రాదు. సర్కారు ఉద్యోగమే ఉద్యోగం కాదు. సమాజంలో అవసరం ఉన్న దాదాపు 180 పైగా నిత్యావసర పనులలో నైపుణ్యం ప్రదర్శించి చేసే ప్రతి పనీ ఉద్యోగమే.ఉపాధి కల్పన విషయంలో గత ప్రభుత్వాలు ప్రజలను సరైన దిశలో నడిపించకపోవడమే ఈ పరిస్థితికి కారణమన్నారు. 60 లక్షల మంది రైతులు వ్యవసాయరంగంలో ఉన్నారు.. ఇంటికి నలుగురు చొప్పున రెండు కోట్ల 40 లక్షల మందికి ప్రత్యక్ష్యంగా ఉపాధి కల్పించినట్లే.. ఇదే తెలంగాణ ప్రభుత్వ విజయం. భవిష్యత్‌లో మూసపంటల సాగును రైతులు విడిచిపెట్టాలి.. నూతన పంటల సాగువైపు నడవాలి. ఉచిత చేప పిల్లలతో తెలంగాణ గ్రామాలలో విరివిగా దొరుకుతున్న చేపల మూలంగా జ్ఞానవంతమయిన భవిష్యత్ తెలంగాణ సమాజం నిర్మాణమవుతుంది. ప్రజలకు అవసరమైన పంటల సాగును ప్రోత్సహించేందుకు తెలంగాణ మార్కెటింగ్ శాఖ కసరత్తు చేస్తుందన్నారు. పిల్లలకు కష్టాన్ని, వ్యవసాయాన్ని పరిచయం చేయాలి.. అప్పుడే వారికి సమాజం పట్ల బాధ్యత తెలుస్తుంది. కొనుగోలు కేంద్రంలో మంచి ధాన్యం తెచ్చిన రైతు సైదులుకు సన్మానం. అందరూ నిబంధనల మేరకు ధాన్యం తెచ్చి మద్దతుధర పొందాలని మంత్రి సూచించారు.
మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాతనే మూసీ కింద రెండు పంటలు పండుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మూలంగా నాలుగేళ్లుగా రెండు పంటలు పండుతున్నాయి.మూసీ గేట్ల రిపేర్లకు గత ప్రభుత్వాలు కనీసం రూ.10 కోట్లు ఇవ్వలేదు. సమైక్య పాలనకు, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనను ప్రజలు, రైతులు గమనిస్తున్నారు. కేసీఆర్ స్వయంగా రైతు అందుకే ఆయన ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు వ్యవసాయాన్ని బతికించాయి. ఆకలి చావులు, ఆత్మహత్యల తెలంగాణ పరిస్థితిని మార్చింది కేసీఆర్ పాలన అన్నారు మంత్రి. ఈ రోజు ఒక్క ఇంట్లో కూడా తినడానికి గింజలు లేవనే పరిస్థితి లేదు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు, పంటకు పెట్టుబడి కింద ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు, రైతు కుటుంబానికి భీమాతో అండగా నిలుస్తున్నది కేసీఆర్ ప్రభుత్వమే అని మంత్రి తెలపారు. రైతులు లాభపడాలన్నదే రైతువేదికల ఉద్దేశం. వరి సాగు భవిష్యత్‌లో రైతాంగానికి ఉరిలా మారుతుంది. రైతులు ఆలోచించి ఆదాయం వచ్చే పంటల సాగు మీద దృష్టి సారించాలని మంత్రి సూచించారు.
సివిల్ సప్లై చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. వందశాతం ధాన్యం కొనుగోళ్లు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ చేపట్టడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రైతు కాబట్టే రైతులు కరోనా సమయంలో నష్టపోవద్దు.. లాభపడాలన్న ఉద్దేశంతోనే కొనుగోళ్లు చేపట్టారు. తాలు లేకుండా, 17 శాతం తేమతో రైతులు రూ.1888 మద్దతు ధర పొందాలి అని అన్నారు.