సైనిక బలగాల నియామకం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీంపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిరసన తెలిపారు . అగ్నిపథ్ ఓ అనాలోచిత నిర్ణయం అన్నారు. 46 వేల మందిని 90 రోజులలో నియామకం చేయడం, అదీ కేవలం రూ.30 వేల జీతంతో అర్దం లేని పని అన్నారు. దేశ భద్రత విషయంలో ఇంత అనాలోచిత నిర్ణయం అవివేకంగా ఉందన్నారు. పదవ తరగతి పాసైన వారు అగ్నిపథ్ లో చేరాక తిరిగి వెళ్లేటప్పుడు 12 వ తరగతి పాసైన సర్టిఫికెట్ ఇస్తామనడం సిగ్గుచేటు అని అన్నారు.
దేశ రక్షణ కోసం తీసుకుంటున్నారా ? .. సర్టిఫికెట్ లో అప్రెంటీస్ షిప్ కోసం తీసుకుంటున్నారా? అని ప్రశ్నించారు. బీజేపీ పాపం ముదిరి పాకానపడింది. మొన్న నల్ల వ్యవసాయ చట్టాలతో రైతుల ఉసురుపోసుకున్నారు. నేడు అగ్నిపథ్ లాంటి నిర్ణయాలతో యువత ఉసురు పోసుకుంటున్నారు, అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నల్లధనం తెస్తాం .. రూ.15 లక్షలు పేదల ఖాతాలలో వేస్తాం అని అమాయకుల ఓట్లు కొల్లగొట్టారు. జీఎస్టీ పేరుతో రాష్ట్రాల ఆదాయం కొల్లగొట్టారు. ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం, స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తాం అని రైతులను మోసం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు అడ్డికి పావుశేరు కింద అమ్మేస్తున్నారు అని ద్వజమెత్తారు.
మోడీ పాలనలో దేశంలో నిరుద్యోగ శాతం 5.6 శాతం నుండి 7.83 శాతానికి పెంచారు. ఆకలిసూచిని 110 దేశాలలో భారత్ ను 101 స్థానంలో నిలపడం దుర్మార్గం. మోడీది అంతా మోసాల పాలన అన్నారు. “దేశప్రజలు , దేశ యువత జాగృతం కావాలి, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆందోళనలు సాగుతున్నాయి. యువత ఆగ్రహాన్ని గమనించి అయినా కేంద్రం తన నిర్ణయాలను ఉపసంహరించుకోవాలి” అని హెచ్చరించారు. దేశభద్రత అనేది షార్ట్ టర్మ్ కోర్సు కాదు .. దేశ భవిష్యత్ కు, రక్షణకు ఇది గొడ్డలిపెట్టు లాంటిది. వేతనాలు, ఫించన్ల భారాన్ని తగ్గించుకోవడానికి కేంద్రం తలాతోకాలేని నిర్ణయం తీసుకుంది అన్నారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో నిరసన తెలుపుతున్న యువతపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ జరిపిన కాల్పులలో ఒకరు మరణించడం , కొందరు గాయపడడం బాధాకరంగా ఉంది. బాధిత కుటుంబానికి, గాయపడిన కుటుంబాలకు కేంద్రం పరిహారం చెల్లించాలి..దేశవ్యాప్తంగా జరిగిన ఘటనలకు కేంద్రం బాధ్యత వహించాలి..అని నిలదీశారు.