కాంగ్రెస్ నీరుపోయలే.. బీజేపీ నారు పోయలే.. ఈ దేశంలో రైతుకు, వ్యవసాయానికి గౌరవం పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. 60 ఏండ్లు పాలకులచే విస్మరించబడిన వ్యవసాయాన్ని ప్రాణప్రతిష్ట చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ నాయకత్వం అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. సోమవారం ఆయన టీఆర్ఎస్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
కాంగ్రెస్ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి ఎర్రవల్లికి పోయి ఏం చేస్తారని మంత్రి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పార్లమెంట్‌లో సోనియాగాంధీతో ఎందుకు మాట్లాడించలేదని నిలదీశారు. టీఆర్ఎస్ ఎంపీలతో కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు పోరాటం చేయలేదని మండిపడ్డారు. హుజురాబాద్‌లో రేవంత్ మీటింగ్‌కి 5వేల మంది వస్తే ఎన్నికల్లో 3 వేల ఓట్లు వస్తాయా? అని మంత్రి అడిగారు.
బీజేపీలో కాంగ్రెస్ పార్టీని కలపడం ఖాయమని మంత్రి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి భూమి ఉంటే మీరు కూడా వరి వేసుకోవాలని… మీరు వరి వేసుకుంటే ఎవరు వద్దు అన్నారు అని ప్రశ్నించారు. రైతుకు గౌరవం పెంచింది కేసీఆర్ ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ – బీజేపీ ప్రవర్తిస్తోందని విమర్శించారు. రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటు, సాగునీటి కోసం ప్రతి ఏటా రైతుల కోసం 60 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు.
కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్లనే తాము పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వ భరోసా లేకుండా వరి వేసుకుంటే తాము ఆపమని మంత్రి స్పష్టం చేశారు. యాటవడ్డంక కుప్పలో భాగం అడిగేరకం కాంగ్రెస్, బీజేపీలది. తెలంగాణ ఉద్యమంలో వీరి పాత్ర ఎంత ? అని ప్రశ్నించారు. వ్యవసాయాన్ని అగ్రభాగాన నిలబెట్టింది కేసీఆర్. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెడుతున్న ఖర్చులో దేశంలో ఏ రాష్ట్రం కూడా చారాణ మందం ఖర్చు పెట్టడం లేదు. వరి ధాన్యం కొనాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం విధానాన్ని నిరసిస్తూ ధర్నా చేశారు.
యాసంగిలో పండేదే బాయిల్డ్ రైస్.. దాదాపు కోటి 50 నుండి కోటి 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పడుతుంది. కేంద్రం తిరస్కరించడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఎంతో బాధతో రైతాంగానికి వరి వేయవద్దని చెప్పాం.. ఇన్ని చేసిన రైతాంగానికి అవకాశం ఉంటే ఇంతా కొంత చేయలేమా ?.. రైస్ మిల్లులతో ఒప్పందం ఉన్నవారు, సొంతంగా అమ్ముకునేవారు, విత్తనాల కోసం అమ్ముకునేవారు వరి వేసుకోవచ్చని రైతులకు తెలపడం జరిగింది. కానీ రేవంత్ దుష్ప్రచారం చేస్తున్నారు.. కేసీఆర్ గారిని ఏక వచనంతో సంబోధించడం సరి కాదు. కేంద్రంలో కత్తులు దూసుకుంటున్న కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రంలో వలపుబాణాలు విసురుకుంటున్నాయి. నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే , నిజంగా దమ్ముంటే ఢిల్లీలో పోరాడండి అని రేవంత్‌కు మంత్రి సలహా ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ గురించి ఎందుకు కాంగ్రెస్ ప్రశ్నించదు. కేంద్రం బాధ్యతలను ప్రశ్నించకుండా కాంగ్రెస్, బీజేపీలు నిత్యం కేసీఆర్ మీద, తెలంగాణ ప్రభుత్వం మీద బురదజల్లుతున్నారు. రైతులను రెచ్చగొట్టి వరి వేయమంటున్నారు.. రేపు రైతులు మిమ్మల్ని నమ్మి వరి వేసుకుంటే ఎక్కడ అమ్ముకోవాలి ? ఏడేండ్లలో తెలంగాణ వ్యవసాయ స్వరూపం మారిపోయింది.. గ్రామాలు కళకళలాడుతున్నాయి. రైతుల జీవితాలతో ఆడుకునే రాజకీయాన్ని రైతాంగం క్షమించదు అని మంత్రి అన్నారు.
సోమవారం నాడు కూర్చుని మంగళవారం రావాలని దీక్ష చేసినట్లుంది బండి సంజయ్ వ్యవహారం..రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ అయిపోయింది త్వరలోనే ఎలాగూ నోటిఫికేషన్లు వేస్తారు.. మరి బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు దమ్ముంటే కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయించాలని హితవు పలికారు. కేంద్రంలో 40,04,941 ప్రభుత్వ ఉద్యోగాలకు 31,32, 698 ఉద్యోగులు ఉన్నారు 8,72,243 ఖాళీలు ఉన్నాయి. ఇది కేంద్రం పార్లమెంటులో వెల్లడించిన వివరాలు.
ఆలికి అన్నం పెట్టి ఊరికి ఉపకారం చేసినట్లుంది కాంగ్రెస్, బీజేపీల వ్యవహారం. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలో విలీనమవడం ఖాయం.. అది ఎంతో దూరంలో లేదు. మేము మోడీకి కాదు ఎవరికీ భయపడం.. మోడీకి భయపడడానికి మేము బొగ్గు గనులు అమ్మలేదు, ఆదాని, అంబానీలకు ఆస్తులు కూడబెట్టలేదు.. దేశ సంపద కొల్లగొట్టలేదు. మోడీ దేశంలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదు.. కాళేశ్వరం మూడున్నరేళ్లలో కట్టి 45 లక్షల ఎకరాలకు కేసీఆర్ సాగు నీరు ఇచ్చారు. ఎంఎస్ పీకి దేశంలో చట్టబద్దత లేదు.. మద్దతుధర ప్రకటించిన వాటిలో పండిన పంటలో 20 – 25 శాతం మాత్రమే కొనేందుకు కేంద్రం అనుమతిస్తున్నది. చేతనైతే కాంగ్రెస్ మద్దతు ధర కోసం పట్టుబట్టాలి .. దాని కోసం పోరాడాలి అని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు.