ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 54.37 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.5145.87 కోట్లు రైతుబంధు సాయం జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. రైతు బంధు పంపిణీలో భాగంగా ఐదవరోజు 4.90 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.1050.10 కోట్లు జమ చేశామని చెప్పారు. మొత్తం 102.92 లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం అందనుంది. అత్యధికంగా నల్లగొండలో ఇప్పటి వరకు 3,97,260 మంది రైతులకు రూ.401.92 కోట్లు.. అలాగే అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 27,819 మంది రైతులకు రూ.19.68 కోట్లు రైతుబంధు సాయం అందినట్లు మంత్రి వెల్లడించారు.
నల్గొండ తర్వాత నాగర్ కర్నూలు జిల్లాలో అత్యధికంగా 2,35,549 మంది రైతులకు రూ.254.62 కోట్లు, మూడోస్థానంలో సంగారెడ్డి జిల్లా 2,66,797 మంది రైతులకు రూ.247.67 కోట్లు జమ అయ్యాయి. రైతుబంధు సాయంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం అనూహ్యంగా పెరిగింది. రాష్ట్రంలో వస్తున్న పంటల దిగుబడే దీనికి నిదర్శనమన్నారు మంత్రి. ఆకలికేకల తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారింది. తెలంగాణ ఆవిర్భావ సమయంలో 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములను 29.26 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచడం జరిగింది.
ప్రస్తుతం రాష్ట్రంలోని గోదాములతో పాటు రైతు వేదికలు, కాటన్ మిల్లులు, అవకాశం ఉన్న ప్రతిచోటా ధాన్యం నిలువచేయడం జరిగింది. వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ప్రాధాన్యత మూలంగానే ఇది సాధ్యం అయిందన్నారు. ధాన్యం కొనుగోళ్ల గురించి విమర్శలు చేసే విపక్షాలు ముందు ఇంత ఉత్పత్తి ఎలా సాధ్యమయిందో అర్ధం చేసుకుని మాట్లాడాలన్నారు. 2014 – 15 లో వానాకాలం, యాసంగి కలిపి 24.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే కేవలం 2021 ఈ యాసంగి లోనే 90.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడంల జరిగిందని మంత్రి పేర్కొన్నారు.