తెలంగాణ భవన్‌లో మంత్రులు శ్రీ ప్రశాంత్ రెడ్డి, శ్రీ గంగుల కమలాకర్, శ్రీ పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.వడ్లు కొనాల్సిన బాధ్యతల నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూడటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నూకలు తినాలన్న వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం ఎగుమతులను పెంచుకునే ప్రయత్నాలను కేంద్రం చేయడం లేదని ఆక్షేపించారు. సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. ఉగాది తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, కేసీఆరే రైతులకు రక్షణ కవచం అని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల ఉసురుపోసుకున్న సర్కార్లు నిలవలేకపోయానని తెలిపారు. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు తెలంగాణ రైతులు భయపడాల్సిన అవసరం లేదని నిరంజన్ రెడ్డి తేల్చిచెప్పారు.
తెలంగాణను అవమానించిన, అవహేళన చేసిన ఎందరో రాజకీయ భవిష్యత్ లేకుండా పోయారు. చరిత్రపుటల్లో కప్పివేయబడ్డారని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎటువంటి సహకారం లేదన్నారు. దశాబ్దాల పెండింగ్ ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేశామని తెలిపారు. గోదావరి, కృష్ణా జలాలతో రైతుల కాళ్లు కడుగుతున్నామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని గుర్తించి, ఈ రంగం మీద దృష్టి సారించారని తెలిపారు.
ఈ దేశంలో పండించిన వ్యవసాయ పంటలను కొనే బాధ్యత కేంద్రానిదే అని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా లేకి మాటలు మాట్లాడుతున్నారు. హుందాతనం ప్రదర్శించట్లేదు. చచ్చేవరకు కేంద్ర మంత్రి పదవిలోనే ఉంటావా? అని కిషన్ రెడ్డి ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుందని నీ ఆత్మ చెప్పట్లేదా? తెలంగాణలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వడ్లు తీసుకోవాలని కేంద్రానికి ఎందుకు చెప్పడం లేదు. మా వినతిపత్రాలను కనీసం చదవకుండా.. తెలంగాణపై విషం కక్కుతారు. యజమాని బానిసతో మాట్లాడినట్లు కేంద్రం వ్యవహారం ఉందన్నారు.
కాలానుగుణంగా కేంద్రం మారడం లేదు..
యూపీఎ హయాంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ.. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం సహకరించడం లేదని వ్యాఖ్యానించారని మంత్రి గుర్తు చేశారు. ఈ రోజు కేంద్రం మళ్లీ అదేవిధంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కాలానుగుణంగా కేంద్రం మారడం లేదు.. రైతుల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదు. ఇథనాల్ తయారీ వైపు ఎందుకు దృష్టి సారించడం లేదు.. గతంలో మీరే దానికి జై కొట్టారని నిరంజన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ బదులు తీర్చుకుంటుంది.. ఏప్రిల్ 1 వరకు తీర్మానాలు…తెలంగాణ ప్రజల కోసం మేం ఎన్ని అవమానాలైన భరిస్తాం.. కానీ సమయం వచ్చినప్పుడు తెలంగాణ బదులు తీర్చుకుంటుందని మంత్రి నిరంజన్ రెడ్డి తేల్చిచెప్పారు. కేంద్రం తీరు అత్యంత అవమానకరంగా ఉంది.. ఇంత పెద్ద భారతదేశంలో రాష్ట్రాలతో కేంద్రం అనుసరించే తీరు బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 వరకు అన్ని గ్రామపంచాయతీలు, మండలాలు, జడ్పీలలో కేంద్రం వడ్లు కొనాలని తీర్మానాలు చేసి ప్రధానికి పంపుతామని మంత్రి తెలిపారు.