అక్రమ నిర్మాణాలను తొలగించండి: మంత్రి కేటీఆర్

56
ktr minister

జీహెచ్‌ఎంసీ పరిధిలోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో నాలుగోరోజు పర్యటించారు మంత్రి కేటీఆర్. సబితా ఇంద్రారెడ్డి,మేయర్ బొంతు రామ్మోహన్‌తో రాజేంద్ర‌న‌గ‌ర్ ప‌రిధిలోని అప్ప చెరువును పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ చెరువుకు గండిపడి 44వ జాతీయ రహదారి కొట్టుకుపోయింది.

అప్ప చెరువుతో పాటు జాతీయ రహదారిని పరిశీలించిన కేటీఆర్…చెరువులో అక్ర‌మ నిర్మాణాలు ఉంటే తొల‌గించాల‌ని కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సాగునీటి శాఖ‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని తెగిన చెరువు క‌ట్ట‌కు వెంట‌నే మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపైన ప్రధాన దృష్టి సారించి పని చేయాలని జీహెచ్ఎంసీ అధికారుల‌కు సూచించారు. ఎలాంటి అంటురోగాలు ప్రబలకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులతో పాటు తక్షణ సదుపాయాలను ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు.