బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం అన్నారు మంత్రి కేటీఆర్. జిల్లా పార్టీ అధ్యక్షులు, జనరల్ సెక్రెటరీలతో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి పార్టీని మరింత బలోపేతం చేస్తూ, 60 లక్షల పార్టీ శ్రేణులను మరింత చైతన్యపరిచేలా విస్తృతంగా కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ నిర్ణయించిందన్నారు. పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచనల మేరకు పార్టీ కొన్ని కార్యక్రమాలను స్థూలంగా రూపొందించింది. ప్రజాప్రతినిధులు వీలయినంత వరకు ప్రజల్లోనే ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాలను రూపొందించాం అన్నారు.
ఇందులో భాగంగా పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ చేపట్టాలని పార్టీ నిర్ణయించిందన్నారు. పార్టీలో పనిచేసే కిందిస్థాయి కార్యకర్త నుంచి మొదలుకొని ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్థాయి నాయకులందరి మధ్య ఒక ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేసే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగిందన్నారు.
బిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం. వారితో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలి. ఇందుకు ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రతీ పది గ్రామాలను యూనిట్ గా తీసుకొని ఎమ్మెల్యేలు పార్టీ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలి. పట్టణాల్లో ఒక్కో పట్టణానికి, లేదా పట్టణాల్లోని డివిజన్లను కలుపుకుని ఈ సమ్మేళనాలు నిర్వహించాలన్నారు.
ఈ సమ్మేళనాల్లో స్థానిక ఎంపీలను, ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను, కార్పోరేషన్ ఛైర్మన్ లను డిసిసిబి, డిసిఎంఎస్ తదితర పార్టీ ముఖ్యులను కలుపుకొని పోవాలి. ఈ ఆత్మీయ సమ్మేళనాలను రెండు నెలల్లోపు పూర్తి చేయాలన్నారు. ఏప్రిల్ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి ఈ ఆత్మీయ సమ్మేళన నిర్వహణ పూర్తి కావాలి అన్నారు. ఈ దిశగా జిల్లా అధ్యక్షులు తమ పరిధిలోని అన్ని గ్రామాలను కవర్ చేసేలా, 10 గ్రామాలకు ఒక యూనిట్లుగా విభజించి… ఆయా యూనిట్లలో జరిగే ఆత్మీయ సమ్మేళనాలకు సంబంధించిన సంపూర్ణమైన షెడ్యూల్ (క్యాలండర్) పార్టీకి వెంటనే అందించాలన్నారు. ఏరోజు ఏఏ యూనిట్ లో, ఎక్కడ అత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారో తేదీలతో సహా పార్టీ వివరాలు అందించాలన్నారు. దీంతో పాటు జిల్లా పార్టీ కార్యాలయాలు అన్నింటిని ప్రారంభించుకోవాలన్నారు. ఈ కార్యక్రమం కూడా ఏప్రిల్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి పూర్తి కావాలన్నారు.
దీనికి సంబంధించిన షెడ్యూల్ వెంటనే సిద్ధం చేయాలి. ఈ విషయంలో పార్టీతో సమన్వయం చేసుకొని, కార్యాలయాల ప్రారంభోత్సవ తేదీలను నిర్ణయించాలన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మన ప్రభుత్వం, మన పార్టీ నిర్ణయించిందన్నారు.ఈ దిశగా జయంతి ఉత్సవాల కార్యక్రమాలను రూపొందించుకోవాలన్నారు. ఒకవైపు దేశంలోనే అతిపెద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం…మరోవైపు పరిపాలన ఆత్మగౌరవ చిహ్నం అయిన నూతన సచివాలయనికి సైతం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టామన్నారు. దళిత బంధు కార్యక్రమాన్ని ప్రారంభించి, విజయవంతంగా ముందుకు తీసుకుపోతున్నాం అన్నారు.
ఈ విధంగా దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా బిఆర్ అంబేద్కర్ గారి వారసత్వాన్ని స్ఫూర్తిని ఇంత గొప్పగా గౌరవించుకోలేదన్నారు.మన ప్రభుత్వం మన పార్టీ చేపట్టిన ఈ అద్భుతమైన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఆయన జయంతి ఉత్సవాలనురాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవాలన్నారు. జూన్ 1 న అమరవీరుల స్థూపం ఆవిష్కరణ నేపథ్యంలో విస్తృతంగా పలు కార్యక్రమాలను చేపట్టాలన్నారు. దీంతో పాటు 2023-24 విద్య సంవత్సరం జూన్ నెల నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేపట్టాలన్నారు. పార్టీ విద్యార్థి విభాగ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంటుందని..పార్టీ విద్యార్థి విభాగం నూతన కమిటీలను వేసుకోవడం జరిగిందన్నారు.
ఇవి కూడా చదవండి..