హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారం పైన తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పార్టీ ఇంచార్జీలతోపాటు పలువురు సీనియర్ నాయకులతో ప్రచారం జరుగుతున్న తీరుని అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. ప్రస్తుతం హుజూర్నగర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుందని, ప్రజల స్పందన కూడా టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉందని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సర్వేలో తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీ కన్నా చాలా ముందు వరుసలో ఉన్నదని అన్నారు. ప్రస్తుతం కనీసం 50 శాతం ఓట్లు టిఆర్ఎస్ పార్టీకే వస్తాయని తమ అంతర్గత సర్వే తెలిపిందన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం సంతృప్తిగా ఉందని, రానున్న వారం రోజుల్లో మరింత ప్రణాళికాబద్ధంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించాలని కోరారు. గత ఎన్నికల్లోనూ కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తు వలన టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని, ఈసారి కూడా అలాంటి కొన్ని వాహనాలకు సంబంధించిన గుర్తులు ఉన్నాయని, టిఆర్ఎస్ కారు గుర్తుని ప్రజల్లోకి తీసుకు పోయేందుకు డమ్మీ ఈవీఎంలను ఉపయోగించుకోవాలని కోరారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి వివిధ సామాజిక వర్గాల నుంచి మద్దతు అద్భుతంగా వస్తుందన్నారు.
ఈ ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పాలో కాంగ్రెస్ పార్టీకి తెలియడం లేదని, మరోవైపు టీఆర్ఎస్ గెలిస్తే హుజూర్నగర్ కి లాభం, కారు గుర్తుకు ఒటేస్తే హుజూర్నగర్ అభివృద్ధి బాట పడుతుందంటూ తాము చేస్తున్న ప్రచారానికి ప్రజలు మద్దతు ఇస్తున్నారని కెటియార్ అన్నారు.
అందుకే తాజాగా కేంద్ర ప్రభుత్వ నిధులతో హుజూర్నగర్ ను అభివృద్ధి చేస్తామంటూ ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతున్నారని, కానీ కేంద్ర, రాష్ట్రాల్లో ఎక్కడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదన్న విషయాన్ని ఆయన మర్చిపోయారన్నారు. కాంగ్రెస్ కి ఓటేస్తే హుజూర్నగర్ అభివృద్ధి కుంటుపడుతుంది అన్నారు. ఈ ఉప ఎన్నికలతో బిజెపి బలం ఎంతో తేలిపోతుందని, ఇన్నాళ్లుగా వారు చేస్తున్న మాటలు, వట్టి మూటలని తేలిపోతుందని కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి డిపాజిట్ దక్కించుకుంటే అదే వారికి గొప్ప ఉపశమనం అన్నారు. తమకు ఎలాగూ ప్రజల్లో బలం లేదని తెలుసుకున్న బిజెపి, కాంగ్రెస్ పార్టీతో కలిసి పరోక్షంగా పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్, బిజెపిల దొంగచాటు బంధాన్ని ప్రజల్లో ఎండ కట్టాలని ఈ సందర్భంగా కేటీఆర్ ఆర్ పార్టీ ఇన్చార్జీలకు సూచించారు. ఈ టెలికాన్ఫరెన్సు సందర్బంగా హూజుర్ నగర్ లో పనిచేస్తున్న ఇంచార్జీలతో కెటియార్ మాట్లాడారు.