టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరుసగా మూడో రోజూ నగరంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఎల్బీనగర్ సర్కిల్ లోని ఆర్కేపురం అష్టలక్ష్మీ చౌరస్తాలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 99 సీట్లు ఇచ్చి హైదరాబాద్ ప్రజలు గత ఎన్నికల్లో గెలిపించారు. ఈ ఐదేళ్ల ఎంతో అభివృద్ధి చేసి చూపించి మళ్లీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చామని కేటీఆర్ అన్నారు. నీళ్లు, కరెంటు, మెట్రో పరుగులు నగరంలో పెట్టిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. అప్పటి సీఎం కిరణ్ కుమర్ రెడ్డి తెలంగాణ వస్తే హైదరాబాద్ అతలాకుతలం అయిపోతుందని భయపెట్టారని ఇప్పుడు ఏమైందని ఆయన అడిగారు.
గండిపేట రిజర్వాయర్ ను తలదన్నే రీతిలో హైదరాబాద్ ప్రజలకు నీటిని ఇచ్చే కేశవాపురం రిజర్వాయర్ కడుతున్న ముందు చూపున్న నాయకుడు కేసీఆర్, ఈ ఆరేళ్లలో పేదవాడికి ఐదురూపాయలకే అన్నం పెట్టినం, బస్తీ బస్తీలో దావఖానాలు పెట్టినం అని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో పక్కా లోకల్ ఎవరు అన్నది మనం ఆలోచించాలని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ గులాబీలు కావాలా, గుజరాత్ గులాంలు కావాల్నా ఆలోచించండి అని కేటీఆర్ అన్నారు.
బీజేపీ నేతలు ఏంచేశారో చెప్పేందుకు వాళ్లకి విషయం లేదని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ కు ఏంచేస్తావయ్యా అంటే వాళ్లు చెప్పరని ప్రజల్ని రాంగ్ రూట్లో పోండని ఓట్లకోసం దిగజారిపోతున్నారని కేటీఆర్ అన్నారు. ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ కావాలా తెల్లారి లేస్తే గొడవలతో ఉండే హైదరాబాద్ కావాలో తేల్చుకోండని కేటీఆర్ పేర్కొన్నారు. డిసెంబర్ 1నాడు జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయభారతి అరవింద్ శర్మ, అనితాదయాకర్ రెడ్డికి విజయం చేకూర్చాలని కేటీఆర్ హైదరాబాదీ ప్రజలకు విన్నవించారు.