పారిశుద్యంపై దృష్టిసారించండి: మంత్రి కేటీఆర్

130
ktr

పురపాలక శాఖ ఉన్నతాధికారులు, జోనల్ కమిషనర్ ల తో సమావేశమయ్యారు మంత్రి కేటీఆర్.జిహెచ్ఎంసిలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల పైన మంత్రి కే తారకరామారావు జోనల్ కమిషనర్లు తో ఈ రోజు ప్రగతిభవన్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్,పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ మరియు ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుతం జిహెచ్ఎంసి పరిధిలో జరుగుతున్న మౌలికవసతుల కార్యక్రమాలతోపాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సుదీర్ఘమైన చర్చ జరిగింది. ముఖ్యంగా పారిశుద్ధ్యం పైన ప్రధానంగా దృష్టి సారించాలని జోనల్ కమిషనర్లకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

పారిశుద్ధ్యానికి సంబంధించి కార్యక్రమాలను మరింత మెరుగు అమలు పరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రస్తుతం నగర పరిధిలో కొనసాగుతున్న పబ్లిక్ టాయిలెట్లను నిర్మాణానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి కేటీఆర్ అక్టోబర్ 2 నాటికి మరింత పెద్ద ఎత్తున పబ్లిక్ టాయిలెట్ నిర్మాణం కొనసాగించాలని సూచించారు. నగరంలో పెద్దఎత్తున ఫుట్పాత్ల నిర్మాణం కొనసాగుతున్న విషయాన్ని అభినందించిన మంత్రి కేటీఆర్, ఫుట్ పాత్లను సాధ్యమైనంత పెద్దగా ఉండే విధంగా, అవకాశం ఉన్నచోట్ల ప్రయత్నం చేయాలని సూచించారు.

చెరువుల అభివృద్ధి మరియు సుందరీకరణ పనులకు పైన కూడా మరింత వేగంగా కదలాలని ఇందుకు సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పార్కుల అభివృద్ధి పైన ప్రత్యేకంగా డ్రైవ్ చేపట్టడం పట్ల మంత్రి కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలో ఉన్న అన్ని పార్కల్లోను పరిశుభ్రత పెంచడంతోపాటు ప్రతి పార్కు కు వీలున్న చోటల్లా అభివృద్ధి చేసేలా చూడాలని సూచించారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి లకు సంబంధించి పనులు కొంత పెండింగ్ ఉన్న విషయాన్ని మంత్రి అధికారులకు చెప్పి, వాటిని వేగంగా నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని సూచించారు.