సంక్షేమ పథకాలపై ఎందుకింత అక్కసు!

39
ktr
- Advertisement -

పేదల సంక్షేమ పథకాలపై ఎందుకు మీకు ఇంత అక్కసు ప్రధాని నరేంద్ర మోడీ గారూ? అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. ఉచిత పథకాలు వద్దంటూ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యల పైన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

ఇటీవల ప్రధాని మోడీ గారు అవకాశం దొరికినప్పుడల్లా ఫ్రీబీ (రేవ్డీ) కల్చర్ గురించి మాట్లాడుతున్నారు. అయన మాటలు వింటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎనిమిదేళ్ల పాలనలో దేశ ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి, సామాన్యుడి బతుకు భారం చేసిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు పేదవాడి పొట్టకొట్టడానికి వేసిన కొత్త పాచిక ఈ ఉచిత పథకాల మీద చర్చ! అన్నారు.

ఓవైపు పాలు, పెరుగు లాంటి నిత్యావసర వస్తువుల మీద కూడా జీఎస్టీ పన్ను వేసి సామాన్యుల రక్తాన్ని జలగల్లా జుర్రుకునే ప్రణాళికలు అమలుచేస్తున్నదీ కేంద్ర బీజేపీ సర్కార్. మరోవైపు దేశంలోని పేద ప్రజల నోటి కాడి కూడును లాగేసే దుర్మార్గానికి తెగించింది. ఎనిమిదేళ్ల మోడీ పాలనలో దేశంలో పేదరికం పెచ్చుమీరి ఇప్పుడు నైజీరియా కన్నా ఎక్కువమంది పేదలున్న దేశంగా అపకీర్తిని గడించాం. వరల్డ్ హంగర్ ఇండెక్స్ (ఆకలి సూచి)లో నానాటికి దిగజారి 116 దేశాల్లో 101వ స్థానానికి చేరుకున్నాం. దేశంలో పుట్టిన పిల్లల్లో 35.5% మంది పోషకాహార లోపంతో పెరుగుదల సరిగ్గా లేదని కేంద్రం విడుదల చేసిన గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.
మోడికి ముందున్న 14 మంది ప్రధానులు కలిసి రూ. 56 లక్షల కోట్ల అప్పుచేస్తే, మోడి ఒక్కరే సుమారు 80 లక్షల కోట్లకు పైగా అప్పుచేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అడ్డూఅదుపూ లేకుండా చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే దేశ వార్షిక రాబడిలో 37% ఖర్చు అవుతున్నదని మొన్ననే కాగ్ తీవ్ర హెచ్చరిక చేసిందన్నారు.

ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం కేంద్రప్రభుత్వం జీడీపీలో 40 శాతానికి మించి అప్పులు చేయకూడదని కానీ, మోదీ సర్కారు ఇప్పటికే 54 శాతం అప్పులు చేసిందని కాగ్ తలంటింది. పరిస్థితి ఇలాగే పోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉన్నదని కాగ్ హెచ్చరించింది…మరి ఇంత సొమ్ము అప్పుగా తెచ్చిన మోడి ఆ డబ్బును ఏ వర్గాల ప్రయోజనాల కోసం ఖర్చుచేశారో చెప్పాలె. తెచ్చిన ఆ అప్పుతో ఒక్క భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిండ్రా, మరేదైనా జాతీయ స్థాయి నిర్మాణం చేసిండ్రా? పోనీ పేదల కడుపునింపే ఒక్క సంక్షేమ పథకమైనా తెచ్చిండ్రా? ఇవేవీ చేయనప్పుడు మరి ఇన్ని లక్షల కోట్లు ఎవరి బొక్కసాలకు చేరిందో ఆయనే చెప్పాలె.
లక్షల కోట్ల అప్పులు తెస్తారు, దానితో ప్రజోపయోగ పనులు చేయరు, ఉల్టా వాళ్లే పేదవాడి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా పథకాలు పెడితే వాటి మీద ఫ్రీబీ కల్చర్ అంటూ విషం చిమ్ముతారన్నారు.

- Advertisement -