రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావును, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం ప్రగతి భవన్‌లో కలిశారు. ఆర్థిక బలహీనులకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, ప్రభుత్వ, విద్యా సంస్థలు, ఉద్యోగాలకు వర్తించే విధంగా తీసుకున్న నిర్ణయం పట్ల అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి కేటీఆర్‌ను సత్కరించారు. అంతకుముందు మంత్రుల నివాసంలో తనను కలిసిన పలు సంఘాలు, వాటి ప్రతినిధులను తమ వెంట కేటీఆర్ వద్దకు మంత్రి తీసుకెళ్ళారు. వారంతా కలిసి కేటీఆర్‌ను అభినందలతో ముంచెత్తారు. అలాగే, కేటీఆర్‌ను వారు సత్కరించారు. ఆర్థికంగా బలహీనులకు కూడా రిజర్వేషన్లు కల్పించినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.
తనను కలిసినవారితో మంత్రి కేటీఆర్ కూడా సంతోషం పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తనను కలిసి వారితో మాట్లాడుతూ, సమాజంలో అందరికీ అన్ని అవకాశాలుండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సమాన అవకాశాలు కల్పిస్తేనే, సమాజంలో సమ తూకంగా ఉంటుందన్నారు. సమసమాజం సాధించే దిశగానే సీఎం కేసీఆర్ ఆర్థిక బలహీనులకు 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారని తెలిపారు. ప్రస్తుతం రిజర్వేషన్లు యథావిధిగా ఉంటాయని తెలిపారు. ఇప్పటి వరకు విద్యా, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లు పొందని వైశ్య రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, మార్వాడీ జైన్, ముస్లీం మైనార్టీల్లో సయ్యద్, ఖాన్ మొదలైన వర్గాలకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని ఆయన తెలిపారు. కాగా, సమగ్ర కుటుంబ సర్వే-2014 ప్రకారం రాష్ట్రంలో 10శాతం ఎస్సీలు, 12శాతం ఎస్టీలు, బీసీలు 51శాతం ఇతరులు 22శాతం ఉన్నట్లుగా కెటిఆర్ వెల్లడించారు.
కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మనసున్న మానవీయ ప్రభుత్వమని కేటీఆర్ చెప్పారు. ఒకప్పుడు కోటి రతనాల వీణ నా తెలంగాణ అని కీర్తించిన కవుల మాటలను నిజం చేస్తూ సీఎం కేసీఆర్, నేటి తెలంగాణను కోటి ఎకరాల మాగాణను చేశారని చెప్పారు. రైతాంగానికి సరిపడా కోటిన్నర ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. అలాగే, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ని అందిస్తున్న ప్రభుత్వం కూడా దేశంలో తెలంగాణ ఒక్కటేనని చెప్పారు. అదే రైతాంగానికి రైతు బంధు, రైతు బీమాలను ప్రభుత్వమే కల్పించే పరిస్థితి దేశంలో ఎక్కడా లేదన్నారు. పరిశుభ్రమైన ఆరోగ్యెకరమైన మంచినీటిని అందిస్తున్నామని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని, వందకు వంద శాతం నల్లాలు బిగించి, ప్రజలందరికీ ఇంటింటికీ మంచినీరు అందిస్తున్న ఘతన మన రాష్ట్రానిదేనని చెప్పారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్లు, చివరకు మరణానంతరం కూడా వర్తించే విధంగా వైకుంఠ ధామాలు, పరమపద వాహనాలు ఇలా… అనేక పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. అందుకే సీఎం కేసీఆర్ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వమని కేటీఆర్ వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ఇప్పుడున్న రిజర్వేషన్లను యథాతథంగా ఉంచుతూనే, రాష్ట్రంలో ఆర్థికంగా బలహీనులైన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. సమాజంలో ఆగ్ర కుల సమాజిక వర్గాలుగా కొనసాగుతన్న వారిలోనూ ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారు ఉన్నారని, అలాంటి వారికి, ఓపెన్ కెటగిరీలోనే ఉంటున్నారన్నారు. తాజా నిర్ణయంతో ఆర్థికంగా వెనుకబాటులో ఉన్న అగ్రకులాల వారికి ఎంతో ఊరట కలుగుతుందని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని ఆయన అన్నారు. ఈ నిర్ణయం పట్ల అన్ని సమాజిక వర్గాల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయని మంత్రి తెలిపారు. అనేక మంది తనను కలిసి, ఫోన్ల ద్వారా సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి అన్నారు. తనను పొద్దునే మంత్రుల నివాసంలోని తన క్యాంపు కార్యాలయంలో అనేక మంది కలిశారని చెప్పారు. వారంతా తమ కృజ్ఞతలను చెప్పుకోవడానికి అవకాశం కోరగా, తాను మంత్రి కేటీఆర్ వద్దకు తీసుకువెళ్ళినట్లు మంత్రి తెలిపారు. ఇక కేటీఆర్‌ను కలిసిన వారిలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, బ్రాహ్మణ సేవా సమితి గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ, ఆయా సామాజిక వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నారు.