ఈ రోజు జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. రెండున్నర గంటలు సాగిన ఈ సమావేశంలో అసలు హుజూరాబాద్ అనే మాటే రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఏర్పడిన తరువాత ఎన్నో ఎన్నికలు, ఉప ఎన్నికలు ఎదుర్కొందని.. అందులో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఒకటని కేటీఆర్ అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ వచ్చిన తరువాత దీనిపై కూర్చుని మాట్లాడతామని అన్నారు. పని చేసే ప్రభుత్వానికి, పార్టీకి ప్రజల మద్దతు కచ్చితంగా ఉంటుందనే నమ్మకం తమకు ఉందని కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు.
కొంతమంది దళితబంధు విషయంలో కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు..కెసిఆర్ ది బలహీనమైన గుండె కాదు.. దైర్యంతో తెలంగాణ ఉద్యమం ప్రారంభించినట్టే దళిత బంధు పథకం తెచ్చారు. దీనిపై పనికిమాలిన ప్రతిపక్షాలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాయి. ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే హుజురాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా మొదలు పెట్టిన దళితబంధు పథకం అమల్లో పాల్గొనండి అని కేటీఆర్ పేర్కొన్నారు. హుజురాబాద్ చిన్న ఉపఎన్నిక.. హుజురాబాద్ ఎన్నిక వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయేది లేదు..కేంద్రంలో ప్రభుత్వం మారేది లేదు అని కేటీఆర్ తెలిపారు.