న్యూయార్క్ కేంద్రంగా ఉన్న క్యూరియా గ్లోబల్ (ఇంతకు ముందు AMRI Global) హైదరాబాద్ లోని తన కేంద్రంలో పనిచేసే ఉద్యోగులను రాబోయే 12 నెలల్లో రెట్టింపు చేసే ఆలోచనలో ఉంది. ఇప్పటికే మన దేశంలో ఈ కంపెనీ 27 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఇతర క్యూరియా గ్రూప్ సంస్థలు, థర్ట్ పార్టీ సంస్థల కోసం ఔషధ రసాయన శాస్త్రంలో తయారీ, ఒప్పంద పరిశోధన కార్యకలాపాలను ఈ సంస్థ నిర్వహిస్తుంది. క్యూరియా గ్లోబర్ వనరులతో మన దేశంలోని ఆ సంస్థ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఔషధ రసాయన శాస్త్రంలో ఈ గ్రూప్ కు మంచి పట్టుంది.
క్యూరియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ప్రకాష్ పాండియన్ తో మంత్రి కే. తారకరామారావు సమావేశం తరువాత కంపెనీ ఈ ప్రకటన చేసింది. మార్కెట్ లీడ్స్, సప్లై ఛైయిన్ సర్వీసెస్, బిజినెస్ ఎనాలిసిస్, లీగల్ సపోర్ట్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, కన్సల్టెన్సీ సంబంధిత సర్వీసులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్, అకౌంటింగ్, క్వాలిటీ, రెగ్యులేటరీ, కమర్షియల్ సర్వీసెస్, ప్రొక్యూర్ మెంట్, హ్యూమన్ రిసోర్సెస్, కస్టమర్ సర్వీస్, మార్కెటింగ్ & సేల్స్, ట్రైనింగ్, డేటా మెయింటెనెన్స్ సర్వీసెస్, ఎన్విరాన్ మెంట్, హెల్త్ & సేఫ్టీ (ఈహెచ్ ఎస్) వంటి రంగాల్లోని అన్ని క్యూరియా గ్రూపు సంస్థలకు సపోర్ట్ సర్వీస్ అందించడానికి గత ఏడాది హైదరాబాద్ లో గ్లోబల్ షేర్డ్ సర్వీస్ సెంటర్ ను ఏర్పాటుచేసినట్టు మంత్రికి ఈ సమావేశంలో తెలియజేశారు. హైదరాబాద్ లోని గ్లోబల్ షేర్డ్ సర్వీస్ సెంటర్ లో ప్రస్తుతం 115 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, రాబోయే 12 నెలల్లో మరో 100 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ పాండియన్ తెలిపారు.
ఈ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ క్యూరియా గ్లోబల్ అసాధారణ ఎదుగుదల, దాని విస్తరణ ప్రణాళికలు తనకు సంతోషాన్ని కలిగించాయన్నారు. క్యూరియా గ్రూప్ దార్శనికత, లక్ష్యాన్ని సాధించడంలో హైదరాబాద్ లోని గ్లోబల్ షేర్డ్ సర్వీసెస్, R&D కమ్ మాన్యుఫాక్చరింగ్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తాయన్న నమ్మకం తనకు ఉందన్నారు. క్యూరియా గ్రూప్ కు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని కేటీఆర్ తెలిపారు.