మంత్రి కేటీ రామారావు మరొక ప్రఖ్యాత ఆహ్వానం లభించింది. అమెరికాలో జరగనున్న global climate action summit సదస్సులో ప్రసంగించాల్సినదిగా పురపాలక మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ ఎడ్మండ్ జి బ్రౌన్ మంత్రి కేటీ రామారావుకు లేఖ రాశారు. సెప్టెంబర్ 12 నుంచి 14 తేదీ వరకు కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఈ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో పాల్గొని “ఫ్యూచర్ ఆఫ్ ఎనర్జీ అండ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్” అనే అంశంపైన ప్రసంగించాలని మంత్రి కేటీ రామారావును ఈ లేఖలో గవర్నర్ కోరారు.
ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి హాజరవుతున్న ప్రతినిధులకు వాతావరణ మార్పులకు ప్రభుత్వాలు తీసుకుంటున్న కార్యక్రమాలపై చేసే ప్రసంగం ఉపయుక్తంగా ఉంటుందని గవర్నర్ తెలిపారు. ఈ ప్రసంగంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం వంటి కార్యక్రమాలతోపాటు భవిష్యత్తు చేపట్టబోయే కార్యక్రమాలను వాతావరణ అనుకూల కార్యక్రమాల పై కూడా వివరించాల్సిందిగా కోరారు.
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పు పైన చైతన్యవంతం చేసే దిశగా ఈ సదస్సు ఉంటుందని తెలిపిన..,ఈ సదస్సు ద్వారా వివిధ ప్రభుత్వాలను, పాలసీ మేకర్స్ ను సానుకూలంగా ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ సదస్సుకు ప్రపంచం లోని వివిధ ప్రభుత్వాల నుంచి ప్రతినిధులతో పాటు వాతావరణ మార్పులపై పరిశోధనలు చేస్తున్న కీలకమైన వ్యక్తులు హాజరవుతారని మంత్రికి పంపిన ఆహ్వానంలో కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ పేర్కొన్నారు.