కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే ఆత్మసంతృప్తి దొరుకుతుంది- కేటీఆర్

64

కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే ఆత్మసంతృప్తి దొరుకుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆశయం మంచిదైనప్పుడు, ఆలోచన మంచిదైనప్పుడు, సంకల్ప బలం ఉన్నప్పుడు మనం అనుకున్నవన్నీ జరిగితీరుతాయని చెప్పారు. దానికి గొప్ప ఉదాహరణ స్పర్శ్‌ హాస్పిస్‌ అన్నారు. క్యాన్సర్‌ రోగుల కోసం హైదరాబాద్‌లోని ఖాజాగూడలో నూతనంగా నిర్మించిన స్పర్శ్‌ హాస్పిస్‌ భవనాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్పర్శ్‌ హాస్పిస్‌ నుంచి ఆహ్వానం వచ్చే వరకు పాలియేటివ్‌ కేర్‌ అంటే ఏంటో తెలియదని చెప్పారు. పాలియేటివ్‌ కేర్‌ గురించి స్వయంగా తెలుసుకుంటే గొప్పగా అనిపించిందని తెలిపారు. ఐదేండ్లలోనే స్పర్శ్‌ హాస్పిస్‌కు మంచి భవనం రావడం సంతోషకరమని వెల్లడించారు.

రోటరీ క్లబ్‌ చేసే ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున సహకారం ఉంటుందని చెప్పారు. స్పర్శ్‌ హాస్పిస్‌కు నీటి బిల్లు, విద్యుత్‌ బిల్లు, ఆస్తిపన్ను రద్దుచేస్తామని హామీ ఇచ్చారు. మహాకవి శ్రీశ్రీ అన్నట్లు స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదేనని పేర్కొన్నారు. ప్రభుత్వమే అన్ని చేయాలంటే కుదరదని, ప్రైవేటు సంస్థలతో కూడా ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుందని స్పష్టం చేశారు. కాన్సర్ రోగులకు ఎంతో చేయాల్సింది ఉంది. వాక్కు శుద్ధి,లక్ష్య శుద్ధి ,చిత్త శుద్ధి ఉంటే ఏ పని అయిన విజయవంతం అవుతుంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తారు అని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు.