సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో స‌మ‌తుల్య‌మైన అభివృద్ధి- కేటీఆర్‌

134
ktr
- Advertisement -

తెలంగాణ‌లో స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వం, సుస్థిర‌త‌తో కూడిన ప్ర‌భుత్వం ఉన్నందునే పెట్టుబ‌డులు త‌ర‌లివ‌స్తున్నాయి. ఈ రెండు స‌మ‌తుల్యంగా ఉన్న‌ప్పుడే అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌న్నారు ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. శనివారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు స‌మీపంలోని మేక‌గూడ‌లో పోక‌ర్ణ ఇంజ‌నీర్డ్ స్టోన్ లిమిటెడ్ కంపెనీని కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ఎంపీ మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అంజ‌య్య యాద‌వ్ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో స‌మ‌తుల్య‌మైన అభివృద్ధి జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. ఐటీ, పారిశ్రామిక రంగాల‌కు ప్రాధాన్యం ఇస్తూనే, ఉపాధి క‌ల్ప‌న‌ల‌కు అవ‌కాశాలు క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు. టీఎస్ ఐపాస్ లాంటి విప్ల‌వాత్మ‌క సంస్క‌ర‌ణ‌లు ఎన్నో చేప‌ట్టామ‌ని తెలిపారు. టీఎస్ ఐపాస్ లాంటి పాల‌సీ ఏ రాష్ట్రంలో లేదు. 15 రోజుల్లోనే ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుమ‌తులు ఇస్తున్నాం. 15 రోజుల్లో అనుమ‌తి రాక‌పోతే డీమ్డ్ అప్రూవ్డ్‌గా భావించ‌వ‌చ్చు అని పేర్కొన్నారు. ప‌రిశ్ర‌మ‌ల‌కు నిరాంత‌రాయంగా నాణ్య‌మైన క‌రెంటు, నీళ్లు అందిస్తున్నామ‌ని తెలిపారు.

పోక‌ర్ణ కంపెనీలో స్థానికుల‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించాల‌ని కోరారు. ఈ ప్లాంటు ద్వారా ప్ర‌త్య‌క్షంగా 500 మందికి, ప‌రోక్షంగా 3 వేల మందికి ఉపాధి ల‌భిస్తుంద‌న్నారు. ఈ కంపెనీకి అన్ని విధాలా తెలంగాణ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌న్నారు. క‌లిసిక‌ట్టుగా ముందుకు న‌డిస్తేనే అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -