తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి కేంద్రం ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది కానీ, ఆయా బడ్జెట్లలో నేతన్నలను పట్టించుకున్నది ఏమీ లేదని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయన రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌లో పలు అంశాలపై సమీక్షించారు. ఈ సమీక్ష అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు కేంద్రంతో రూ. 897 కోట్లు మంజూరు చేయించాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని డిమాండ్ చేశారు. పోచంపల్లి కేంద్రంగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్‌లూమ్ టెక్నాలజీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
లూమ్ అప్‌గ్రేడేషన్ పథకానికి కేంద్రం సహాయం చేయాలని, టెక్స్‌లైట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్తగా 11 చేనేత క్లస్టర్లను మంజూరు చేయించాలని, మెగా పవర్‌లూం క్లస్టర్‌ను మంజూరు చేయించాలని మంత్రి డిమాండ్ చేశారు. కేంద్రం మంజూరు చేయకుంటే రాష్ట్రంలోని నేతన్నలను ఏకం చేసి.. పోరాటం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.