రాష్ట్ర వ్యాప్తంగా 260 కంటైన్మెంట్ జోన్‌లు- కేటీఆర్‌

478
ktr
- Advertisement -

కోవిడ్-19ను అరికట్టుటకు కంటైన్మెంట్ జోన్స్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి కే తారక రామారావు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 260 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాటిలో జిహెచ్ఎంసి పరిధిలోనే 146 జోన్లు ఉన్నట్లు తెలిపారు. ఇతర జిల్లాల్లోని 43 మున్సిపాలిటీలలో మిగిలిన 114 కంటైన్మెంట్ జోన్లు ఉన్నట్లు తెలిపారు. మంత్రులు ఈటెల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి జిహెచ్ఎంసి కార్యాలయం నుండి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో  వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు.

కంటైన్మెంట్ జోన్లలో వున్న ప్రజలను ఇండ్లకే పరిమితం చేయాలని మున్సిపల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు మంత్రి కె.టి.ఆర్ స్పష్టం చేశారు. పాలు, కూరగాయలు, నిత్యావసరాలు, మెడిసిన్స్ ను  ఇండ్ల వద్దకే సరఫరా చేయాలని సూచించారు. తదనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నియమించిన వాలెంటీర్లు, సిబ్బందిచే మాత్రమే నిత్యవసరాలను డోర్ డెలవరీ చేయించాలని ఆదేశించారు. వీలైతే వాలెంటీర్లు, సిబ్బందికి ప్రత్యేక దుస్తులు అందజేయాలని తెలిపారు. కంటైన్మెంట్ జోన్లలోకి దాతలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని స్పష్టం చేశారు. కంటైన్మెంట్ జోన్ లోని కుటుంబాల సెల్ నెంబర్లతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి, అవసరాలను తెలుసుకోవాలన్నారు. కంటైన్మెంట్ నిబంధనలు అతిక్రమించిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

నిబంధనల ప్రకారం కంటైన్మెంట్ జోన్లను తొలగించనున్నట్లు తెలిపారు. ప్రజల సహకారం పైనే కంటైన్మెంట్ జోన్ల తొలగింపు ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఆ విధంగా జిహెచ్ఎంసి పరిధిలో  15 కంటైన్మెంట్ జోన్లను తొలగించినట్లు ఈ సందర్భంగా మంత్రి ఉదహరించారు. కొత్త కేసులు నమోదు కాకుండా కంటైన్మెంట్ నిబంధనలపై అవగాహన కల్పించి, ప్రజలను అప్రమత్తం చేయాలని  తెలిపారు. శానిటేషన్, స్ప్రేయింగ్, ఫీవర్ సర్వేలను తగు జాగ్రత్త లతో  నిర్వహించాలని  సూచించారు. శానిటేషన్, స్ప్రేయింగ్ సిబ్బంది తప్పనిసరిగా రక్షణ పరికరాలు ధరించేవిధంగా మానిటరింగ్ చేయాలని తెలిపారు. సోడియం హైఫో క్లోరైట్ ద్రావనం నిల్వలను ముందస్తుగా తెప్పించుకోవాలని తెలిపారు. శానిటేషన్ తో పాటు మురుగునీటి వ్యవస్థలను మానిటరింగ్ చేయాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. కంటైన్మెంట్ నిబంధనల అమలులో వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు, వాటర్ వర్క్స్ /ప్రజారోగ్య విభాగాలతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.

కంటైన్మెంట్ జోన్లను మానిటరింగ్ చేసేందుకు చేపట్టాల్సిన 12 ప్రధాన అంశాల గురించి అధికారులకు మంత్రి కె.టి.ఆర్ వివరించారు:

1) సరైన విధంగా బారీకేడింగ్ చేయాలి. 2) సంబంధిత శాఖల సిబ్బందిని నియమించాలి. 3) ఫీవర్ సర్వే కై పారమెడికల్ సిబ్బందిని నియమించాలి. 4) శానిటేషన్, స్ప్రేయింగ్ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలి. 5) నిత్యవసర వస్తువులను ఇంటింటికి అందించుటకై ఏర్పాట్లు చేయాలి. 6) పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా కంటైన్మెంట్ నిబంధనలు పాటించాలని కోరుతూ, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి ప్రచారం చేయాలి. 7) ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేయాలి. 8) ప్రతిరోజు మెడికల్ టీమ్, అధికారులు ప్రతి ఇంటిని సందర్శించాలి. 9) సీనియర్ అధికారులు కంటైన్మెంట్ ఏరియాని తనిఖీ చేయాలి. 10) కంటైన్మెంట్ జోన్‌లోని ప్రజలను ఇంటికే పరిమితం చేయాలి, వారి కదలికలను నియంత్రించాలి. 11) అత్యవసర వైద్య సేవలకై  అంబులెన్స్ ను సిద్దంగా ఉంచాలి. 12)  బియ్యాన్ని పంపిణీ చేయాలి.

లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉన్నందున ఎక్కడ ఉన్న ప్రజలు అక్కడే ఉండాలని, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతిలేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. మార్చి నుండి లాక్ డౌన్ విధించినందున వలస కార్మికులు తమ రాష్ట్రాలు, జిల్లాలకు వెళ్లేందుకు తొందరపడుతున్నప్పటికీ, రోడ్లపైకి ఎవరిని అనుమతించరాదని తెలిపారు. వలస కార్మికులకు ప్రస్తుతం వారు ఉన్న ప్రాంతంలోనే భోజన సదుపాయాలు కల్పించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఒకవేళ వలస కార్మికులు రోడ్లపైకి వస్తే ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ వ్రుధా అవుతాయని పేర్కొన్నారు. అవసరమైతే ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడాలని సూచించారు. ఈ అంశంలో హైదరాబాద్, దాని చుట్టుప్రక్కల ఉన్న మున్సిపాలిటీలలో జరుగుతున్న పారిశ్రామిక, నిర్మాణ పనుల నిమిత్తం ఎక్కువ మంది వలస కార్మికులు ఉంటున్నట్లు తెలిపారు. వారందరీ సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నదని తెలిపారు. ఆయా పరిశ్రమలు, నిర్మాణ సంస్థలు వలస కార్మికులకు కల్పిస్తున్న సదుపాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు.

సొంత వైద్యం మరింత ప్రమాదమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు పేర్కొన్నారు. ఇటీవల జ్వరం, గొంతు నొప్పి నివారణకు మెడికల్ షాపుల నుండి మందులు కొనుగోలు చేసిన వారి వివరాలను తెలుసుకోవాలని అధికారులకు సూచించారు. అందులో భాగంగా డ్రగ్ ఇన్ స్పెక్టర్ల సహకారంతో ఆయా మున్సిపాలిటీలలోని ఫార్మసి అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేకంగా సమీక్షించాలని తెలిపారు. జ్వరం, గొంతు నొప్పి మందులను కొనుగోలు చేసిన వారి వివరాలను తప్పనిసరిగా అందజేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పరిశుభ్రతపై ద్రుష్టి సారించి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహించడం వలన రాష్ట్రంలో పారిశుధ్య పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. కరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు ఇది దోహదపడుతున్నట్లు తెలిపారు. అత్యవసర సేవలను అందించుటకై 104, 108 వాహనాలే కాకుండా ప్రైవేట్ అంబులెన్స్ లను కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు.

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కంటైన్మెంట్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించుటకై కేబుల్ టి.విలు, ఆటోల ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించిన వాహనాలను స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్, డైరెక్టర్ సత్యనారాయణ, కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్ లోకేష్ కుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతమహంతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -