సాంకేతిక ఫలాలు సామాన్యుడికి అందినపుడే నిజమైన పురోభివృద్ధి అని రాష్ట్ర ఐ.టి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సామాన్యుడికి సాంకేతిక ఫలాలు అందనపుడు సాంకేతిన నైపుణ్యత ఉన్నా ఫలితం నిష్ప్రయోజనం, శూన్యమేనన్నారు. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ టి-సాట్ కార్యాలయంలో గురువారం జరిగిన ప్రథమ వార్షికోత్సవ సభకు హాజరై మంత్రి మాట్లాడారు. తొలుత కార్యాలయ ఆవరణలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం టి-సాట్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి ప్రసంగించారు.
సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. సామాన్య ప్రజలకు సాంకేతిక ఫలాలు అంది, వాటి ద్వార ప్రయోజనం పొందినపుడే నిజమైన సాంకేతికత సాధించినట్లుగా భావించాలని గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంధ్రశేఖర్ రావు చెప్పిన మాటలను గుర్తుచేశారు. తాను సంబంధిత శాఖకు మంత్రిగా ఉన్నందున ముఖ్యమంత్రి పలుమార్లు ఈ విషయాన్ని తనకు సూచించేవారని సభలో వెళ్లడించారు. గత యేడాది ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి ఇక్కడే డిజిటల్ తరగతులను ప్రారంభించి లక్షలాది మంది విద్యార్థులకు డిజిటల్ బోదన అందించగల్గుతున్నామన్నారు. పోటీ పరీక్షల విషయంలో టి-సాట్ సేవలు మంచి ఆదరణ పొందాయని, పోటీ పరీక్షల ప్రకటన వెలువడగానే టి-సాట్ ప్రసారాల కోసం నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్న పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణ యువత భాగస్వామ్యాన్ని పెంచేందుకు టి-సాట్, ఉన్నత విద్యాశాఖ కలసి ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని మంత్రి సూచించారు. మారు మూల ప్రాంత నిరుద్యోగ యువతను చైతన్య పరిచేందుకు జిల్లాల వారిగా చేపట్టే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. టి-సాట్ 2,00,000 సబ్ స్రైబ్స్, 31 మిలియన్ల వీవ్స్ తో సంతృప్తి చెందకుండా ప్రైవేటు సంస్థలకు పోటీగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు.
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కె.పాపిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసే ఉద్యోగాల్లో తెలంగాణ అభ్యర్థుల భాగసామ్యం నామమాత్రంగానే ఉందన్నారు. ప్రస్తుతం అవలంభిస్తున్న విద్యావిధానం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని ఇటీవల జైపూర్ పర్యటనకు వెళ్లినపుడు స్పష్టమైందన్నారు. సీఈవో శైలేష్ రెడ్డి మాట్లాడుతూ.. సేవా ధృక్పతంతో నడుపుతున్న టి-సాట్ ఛానళ్లు అగ్రభాగాన నిలిచాయంటే అది మంత్రిగా కేటీఆర్ ఇచ్చిన స్వేచ్ఛ వలనే సాధ్యమైందన్నారు. టి-సాట్ ను ఆరవ తరగతి విద్యార్థుల నుండి ఉన్నత స్థాయి విద్యనభ్యసించే వారితో పాటు భవిష్యత్‌లో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
సీఈవోను అభినందించిన మంత్రి: టి-సాట్ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర మంత్రి కె.టి.రామారావు సీఈవో ఆర్.శైలేష్ రెడ్డిని అభినందించారు. విప్లవాత్మక ఆలోచనలతో టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు నిపుణ-విద్యను ముందుకు నడుపుతున్నారని ప్రశంసించారు. భాద్యతలు అప్పగించిన తొలినాళ్లలో పోటీ పరీక్షల అభ్యర్థులకు శిక్షణ మొదటి కార్యక్రమంతో నా వద్దకు వచ్చిన శైలేష్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి చూపించారన్నారు. ఒకానోక దశలలో మనకే ఒక శాటిలైట్ ఉంటే సేవలు మరింత విస్తరించడానికి అవకాశం ఉందన్న శైలేష్ రెడ్డి విప్లవాత్మకమైన ఆలోచన నన్ను ఆలోచింపచేసిందని అన్నారు. గతంలో నామమాత్రంగా ఉన్న ఈ ప్రభుత్వ ఛానళ్లను ప్రధాన్యత క్రమంలోకి చేర్చిన ఘనత శైలేష్ రెడ్డికి దక్కుతుందని అభినందించారు. తెలంగాణ ప్రజల మనసు చూరగొంట్టున్న టి-సాట్ చానళ్ల సిబ్బందిని అభినందించి, వార్సికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.