టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలపై హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కే. తారక రామారావు నగర ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో సోమవారం సమావేశం నిర్వహించారు. పార్టీ సమావేశం సందర్భంగా నగర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపైపోలీస్, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, ఇతర అధికారులతో చర్చించారు. అనతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు ఆదర్శంగా టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయంపై పోరడి, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నది. సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధి ఉద్యమాన్ని ముందుకు తీసుకొనిపోతున్నది. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని హెచ్ఐసీసీలో నిర్వహించపోతున్నాం అని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ, శాసన మండలి, పార్లమెంట్ ప్రతినిధులతో పాటు కార్పొరేషన్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు, సహకార బ్యాంకు అధ్యక్షులు, గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు, పార్టీ కార్యవర్గ సభ్యులు, మహిళా కోఆర్డినేటర్లు, జెడ్పీటీసీలు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, మున్సిపాలిటీల చైర్మన్, మండల, పట్టణ శాఖ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరవుతారు.
27వ తేదీన 10 గంటల లోపల సమావేశ ప్రాంగణానికి అహ్వానిత నాయకులు చేరుకోవాలి.10 గంటల నుంచి 11 గంటలకు ఆహ్వానితుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. 11 గంటలకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ జెండాను ఎగురవేసి సమావేశాన్ని ప్రారంభిస్తారు, సమావేశం 5 గంటల వరకు కొనసాగుతుంది. పార్టీ తరఫున ఆహ్వానించిన వారిని మాత్రమే రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది పార్టీ ప్రతినిధుల సభ మాత్రమేనని గుర్తుంచుకోవాలి. ప్రతి గ్రామపంచాయతీలో గ్రామ కమిటీ పార్టీ జెండాను ఎగుర వేయాలి. గ్రామంలో ఆవిర్భావ దినోత్సవం రోజు పార్టీ కమిటీ సమావేశమై.. తెలంగాణ రాష్ట్రానికి టిఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అనే విషయాన్ని మరోసారి చాటి చెప్పాలి.. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే పార్టీ కేవలం టిఆర్ఎస్ పార్టీ అని తెలపాలి. ప్రతి పట్టణంలో వార్డు లోనూ టిఆర్ఎస్ పార్టీ కమిటీల ఆధ్వర్యంలో బస్తీలో జెండాలు ఎగుర వేయాలి. సమావేశానికి రాకుండా పార్టీ శ్రేణులన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా పార్టీ ఆవిర్భావ సంబరాలను చేసుకోవాలి. ఒక పార్టీకి 21 సంవత్సరాలు నిండడం ఒక కీలకమైన మైలురాయి… ఈ నేపథ్యంలో సంబరాలను ఘనంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్.
ప్రతి గ్రామంలో.. ప్రతి వార్డులో పార్టీ ఆవిర్భావం సందర్భంగా జెండా కార్యక్రమాలు జరగాల్సిన కార్యక్రమాలను సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులదే. ఈ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు నిర్వహణకు సంబంధించి కొన్ని కమిటీలను ఏర్పాటు చేశాం వాటికి సంబంధించిన పూర్తి జాబితా జత చేయడం జరిగింది. నగర అలంకరణకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు బాధ్యత తీసుకుంటారు. పార్టీ ఆవిర్భావ సంబరాలకు సంబంధించిన స్థానిక ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. వాటిలో పాల్గొనాల్సిందిగా పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పార్టీ సమావేశం సందర్భంగా నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నగర పోలీసులు ట్రాఫిక్ పోలీసులు జిహెచ్ఎంసి వంటి అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం అన్నారు.
కేటీఆర్ పొలిటికల్ కామెంట్స్..
మహబూబ్‌నగర్‌లో పాదయాత్ర చేసిన బండి సంజయ్‌కి అవసరమైతే వాహనం ఏర్పాటు చేస్తాం కర్ణాటక వెళ్లి అక్కడి పరిస్థితులను… తెలంగాణలో ఉన్న పరిస్థితులను పరిశీలించాలి అని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో పాలన బాగుంది, సంక్షేమ పథకాలు బాగున్నాయి అని తమని తెలంగాణలో కలపమని అన్న బిజెపి రాయచూరు ఎమ్మెల్యేని బండి సంజయ్ కలిసి రావాలి. కర్ణాటకలో ఉన్న అసమర్థ పాలనను చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ఏ ముఖం పెట్టుకొని పాలమూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు బండి సంజయ్ అని ప్రశ్నించారు.
పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేమని చెప్పేందుకా… నదీ జలాల్లో వాటా తేల్చకుండా ఏడేళ్లలో శిఖండి సంస్థను ఏర్పాటు చేసి కేంద్రం తాత్సారం చేస్తున్నందుకా.. పాలమూరులో గద్వాల- మాచర్ల వరకు లైను లేకుండా లేట్ చేస్తున్నందుకా… ఏం చెప్పేందుకు బండి సంజయ్ పాలమూరులో పాదయాత్ర చేస్తున్నారు అని కేటీఆర్ ధ్వజమెత్తారు. సంజయ్ మాటలు మత విద్వేషాన్ని రెచ్చగొట్టిలా చేసే వ్యాఖ్యలు తప్పా ఇంకేం లేదు. ప్రజలకు కేంద్రం ఏం చేసిందో చెప్పాలి. అధికారంలోకి వస్తే ఉచిత విద్య ఉచిత వైద్యం అంటున్న బండి సంజయ్‌కి కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎవరో తెలవదా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి దేశవ్యాప్తంగా ఇవన్నీ ఉచితంగా ఇస్తే అడ్డుకుంటున్నార… పక్కనున్న కర్ణాటకలో బిజెపి ఏమైనా ఇస్తున్నదా.. సొల్లు పురాణం, అబద్ధపు మాటలు తప్పించి ఇంకేం లేదు.. అని బిజెపి నేతలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.