అంకుర సంస్థలకు తెలంగాణ ఊతం : కేటీఆర్

26
ktr

తెలంగాణ యువకులు నలుగురు నడచిన దారిలో నడవాలనుకోలేదు. తామే కొత్త దారులు వేయడానికి బయలుదేరారు. తమకున్న అలోచనలను రంగరించి అంకుర పరిశ్రమలు (స్టార్టప్స్) నెలకొల్పారు. ఇప్పుడిప్పుడే తొలి ఫలితాలను సాధిస్తున్నారు. తెలంగాణ కీర్తిని దశదిశలా చాటుతున్నారు. ఇవ్వాళ ఆ నలుగురు ప్రతిభావంతులనూ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్‌లో కలిశారు. వారిని అభినందించి వెన్నుతట్టారు.

వరంగల్‌కు చెందిన అరుణ్ కుమార్ రాపోలు ఇంజానీరింగ్ పూర్తి అయ్యాక కొన్నాళ్లు అనిమేషన్, గేమింగ్ కంపెనీల్లో పనిచేశాడు. తరువాత తానే ఏ- థీరం అనే అనిమేషన్ అంకుర పరిశ్రమ స్థాపించాడు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మనదేశంలో తొలి మోషన్ క్యాప్చర్ సినిమా “ధీర” రూపొందించాడు. పూర్తిగా తెలంగాణలో తయారైన ఈ సినిమా 12 భాషల్లో అమెజాన్ ప్రైం లో ఈ నెల విడుదల అయ్యి విశేష ప్రజాదరణ పొందుతోంది.

ఇవ్వాళ మంత్రి కేటీఆర్‌ను కలిసిన అరుణ్ కుమార్ తెలంగాణ ఏర్పడ్డాక అంకుర పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుకు కృతజ్ఞతలు తెలిపారు. టీ-హబ్, వీహబ్, టీ-వర్క్స్, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు చేసి దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా స్టార్టప్ ఎకో సిస్టం తెలంగాణలో అభివృద్ధి చేశారని అరుణ్ కుమార్ అన్నారు. త్వరలోనే పూర్తి స్థాయి ఆఫీస్ కొరకు నూతన భవనం కూడా నిర్మించనున్నట్లు అరుణ్ మంత్రికి తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొలి ప్రయత్నంలోనే ఒక అద్భుతమైన మోషన్ క్యాప్చర్ సినిమా తీసి సక్సెస్ సాధించిన అరుణ్ కుమార్‌ను అభినందించారు.వివిధ భారతీయ భాషల్లో డిజిటల్ పబ్లిషింగ్ ప్లాట్‌ఫారం కహానియా (Kahaniya) వ్యవస్థాపకుడు పల్లవ్ బజ్జూరి, నానో డిస్ట్రిబ్యూషన్ సంస్థ “ఎక్స్ప్రెస్” (Exprs) ఫౌండర్ శ్రీనివాస్ మాధవం, డిజిటల్ క్యాంపస్ ప్లాట్‌ఫారం “స్టూమాగ్జ్” (stuMagz) వ్యవస్థాపకుడు శ్రీచరణ్ లక్కరాజు కూడా ఇవ్వాళ మంత్రిని కలిసి తమ అంకుర సంస్థల ప్రస్థానం గురించి మంత్రి కేటీఆర్‌కు వివరించారు.

ఈ సందర్భంగా శ్రీచరణ్ లక్కరాజు రచించిన “డాడ్” అనే పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ యువత నూతన ఆలోచనలతో అంకుర పరిశ్రమలు (స్టార్టప్స్) స్థాపించి విజయాలు సాధించడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.