బ్రాడ్ బ్యాండ్ ను ఒక యూటిలీటీగా గుర్తించాలి- కేటీఆర్‌

262
Minister KT Rama Rao writes to Manoj Sinha,
- Advertisement -

విద్యుత్, టెలిఫొన్ మాదిరే ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ సేవలను ఒక ప్రాథమిక వినియోగ సేవగా (యూటిలీటీ) గుర్తించాలని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి మనోజ్ సిన్హాకు తెలంగాణ  ఐటి శాఖ మంత్రి  కెటి రామారావు ఒక లేఖ రాసారు. జాతీయ స్ధాయిలో ఇంటింటికి ఇంటర్నెట్ ఏర్పాటు కార్యక్రమం ఏర్పాటు కోసం రైట్ అప్ వే చట్టం చేయాలని కోరారు.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేసిన చట్టాన్ని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికి ఇంటర్నెట్ కార్యక్రమాన్ని తన లేఖలో వివరించారు. మంత్రి లేఖలో  ఇంటర్నెట్ ప్రాథాన్యత, అవసరాన్ని, ప్రయోజనాలను తన లేఖలో  అంశాలను ప్రస్తావించారు.
KTR
అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞాన నేపథ్యంలో బ్రాడ్ బాండ్ వినియోగం పెరుగుతూ వస్తోందని మంత్రి లేఖలో తెలిపారు. ప్రజలు సమాచార, కమ్యూనికేషన్ అవసరాల కోసం ఇంటర్నెట్ పైన ఆధారపడటం పెరిగిందని, బ్రాడ్ బాండ్ వినియోగం ద్వారా వీటిని తీర్చుకుంటున్నారని ఈ లేఖలో పేర్కొన్నారు.  బ్రాడ్ బాండ్  సేవల విస్తృతి ఎంతగా పెంచితే, ఆ స్థాయిలో దేశ స్థూల జాతీయోత్పత్తి పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి సైతం సూచించిందని తన లేఖలో తెలిపారు. సమాజంలోని కిందిస్ధాయి వర్గాలకు  కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ టీవీల వినియోగం ద్వారా సమాజంలోని అంతరాలను తగ్గించేందుకు ఇంటర్నెట్ సహకరిస్తుందని తెలిపారు. ప్రజల దైనందిక జీవితంలో ప్రభుత్వ సేవలు పొందడంతోపాటు, తమ ప్రాథమిక హక్కులను పొందడంలో ఇంటర్నెట్ ఒక ప్రధానమైన మాధ్యమంగా మారిందన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగి ఉన్న నేపథ్యంలో అందరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉంచడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతగా మారిందన్నారు. ఈ మేరకు దీన్ని విద్యుత్, టెలిఫోన్, తాగునీరు వంటి ప్రాథమిక వినియోగ సేవల్లో ఒకటిగా గుర్తించాలన్నారు.

గడిచిన ఇరవై సంవత్సరాల పరిశీలనలో గ్రామాల్లోనూ మోబైల్ సేవల వినియోగం పెరిగిందన్నారు. అయితే బ్రాడ్బ్యాండ్ సేవల విషయంలో మాత్రం ఎక్కువ మంది వినియోగదారులకు ఆకట్టుకోలేకపోయిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. టెలిఫోన్ ద్వారా ఇంటర్నెట్ అందించే వైర్ లెస్ ఇంటర్నెట్ సేవలు 3g, 4g సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో అనేక రెట్లు పెరిగినప్పటికీ హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కోసం డిమాండ్ పెరుగుతుందన్నన్నారు. ఈ నేపథ్యంలో హైస్పీడ్ ఇంటర్నెట్ కోసం ఇంటింటికీ ఆప్టిక్ ఫైబర్ అనేదే నమ్మకమైన పరిష్కార మార్గంగా కనిపిస్తుందన్నారు. ఈ మార్గంలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ తో పాటు టెలివిజన్ ప్రసారాలను, టెలిఫోన్ సేవలను అందించేందుకు వీలు కలుగుతుందని తెలిపారు.  ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు.

అయితే ఇంటింటికి ఇంటర్నెట్ సేవల కార్యక్రమాన్ని జాతీయస్థాయిలో ఒకేసారి ఏర్పాటు చేయడం సాధ్యం కాదని, అనేక సవాళ్లతో కూడుకున్న ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ, చివరి మీటర్ ఆప్టిక్ ఫైబర్ కనెక్టివిటీ వంటి అనేక సమస్యలు ఇందుకు అడ్డంకులుగా ఉన్నాయని మంత్రి లేఖలో తెలిపారు. ఇలాంటి సవాళ్లను అధికమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చురుకైన భాగస్వామ్యం కావాలన్నారు. బ్రాడ్ బాండ్ ప్రతి ఇంటికి చేరాలని ఒక మహోన్నత లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కలిసి ముందుకు సాగాలని మంత్రి కోరారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారత్ నెట్ అనే కార్యక్రమాన్ని అభినందించిన మంత్రి కేటీ రామారావు, తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం కింద చేపట్టిన పలు కార్యక్రమాలను తన లేఖలో వివరించారు. ఇంటింటికి ఇంటర్నెట్ అందించే లక్ష్యం కోసం ప్రత్యేకంగా తాము తెలంగాణ పైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం తమ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమంతో అనుసంధానమైన ప్రణాళికలను చేపట్టినట్లు తెలిపారు.

నూతనంగా నిర్మించబోయే ప్రతి భవన సముదాయానికి బ్రాడ్బాండ్ కేబుల్ డక్ట్ కలిగి ఉండాలని ట్రాయ్ ఇచ్చిన సూచనను, ఈ మద్య జరిగిన టెలికాం కమిషన్ సమావేశంలో ఆమోదం తెలిపిన విషయాన్నిన మంత్రి ఈ సందర్భంగా తన లేఖలో ప్రస్తావించారు. ఈ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం గట్టిగా సమర్థిస్తుందన్నారు. ఈ ప్రతిపాదనను చట్టరూపం దాలిస్తే చివరి మైలు కనెక్టివిటీ అనే ప్రధానమైనటువంటి సమస్య తీరిపోతుందన్నారు. ఈ ప్రతిపాదనను అన్ని రాష్ట్రా ప్రభుత్వాలు పాటించేలా నగర పట్టణాభివృద్ధి శాఖ ద్వారా అవవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు. ఇందుకోసం బ్రాడ్బ్యాండ్ అనేది ఒక ప్రాథమిక వినియోగ  సేవగా మార్చాలని లేఖలో కోరారు.  బ్రాడ్ బాండ్ డక్ట్ ఉన్న భవనాలకు మాత్రమే ఆక్యూఫెన్సీ సర్టిఫికెట్లు జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇలాంటి ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ చేర్చే లక్ష్యం దిశగా ఇది ఒక ముందడుగు అవుతుందన్నారు. ఇలా  ప్రతి ఇంటికి ఇంటర్నెట్క కనెక్టివిటీ అనేక విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలుకుతుందని మంత్రి కేటీ రామారావు ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -