లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తాం

180
Minister KT RAMA RAO Review meeting
- Advertisement -

వచ్చే ఏడాదిలోగా హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి కె.టి. రామారావు తెలిపారు. నగర పరిధిలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యిందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు వచ్చే 12 నెలల్లో వీటి నిర్మాణం పూర్తిచేసేలా పక్కా ప్రణాళికలతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని జలమండలి కార్యాలయంలో మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో పాలు పంచుకుంటున్న ఏజెన్సీలతో సమీక్ష జరిపారు.

KTR

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పథకం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమమని, దీన్ని పూర్తి చేసేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి కేటీఆర్ ఏజెన్సీలకు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఏవైనా ఇబ్బందులున్నాయా అని మంత్రి వర్కింగ్ ఏజెన్సీలను అడిగి తెలుసుకున్నారు. వర్కింగ్ ఏజెన్సీలు తెలిపిన సమస్యలు, పలు అంశాలపైన రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలాఖరులోపు పలుచోట్ల పనులు ప్రారంభమయ్యేలా నగర పరిధిలోని ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ సందర్భంగా నగర పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలతో, అధికారులతో సమావేశం నుంచే ఫోన్లో మాట్లాడారు.

సకాలంలో పనులు పూర్తి చేసిన వర్కింగ్ ఏజెన్సీలకు అదనపు ప్రోత్సాహకాలు ఇస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. వాటిని నిర్ణయించాల్సిందిగా ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయని వర్కింగ్ ఏజెన్సీలకు జరిమానాలు సైతం విధిస్తామన్నారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో పాటించాల్సిన ఆధునిక సాంకేతికతలను కూడా ఈ సమావేశంలో చర్చించారు. వర్కింగ్ ఏజెన్సీలు ఇసుక సరఫరా అంశాన్ని ప్రస్తావించినప్పుడు టీఎస్ ఎండీసీ ఆధ్వర్యంలో నగరానికి నలువైపుల ఒక్కో ఇసుక డిపోలను ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతున్న సైట్ల నుంచి సీసీ కెమెరాల ఫీడ్ తీసుకుని ఒక కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి పనులను పర్యవేక్షించాలన్నారు. ఈ పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా అధికారులు, వర్కింగ్ ఏజెన్సీల కోసం ప్రత్యేకంగా ఒక వాట్స్ అప్ గ్రూప్ ఏర్పాటు చేయాలన్నారు.

KTR

ఈ సమావేశంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దనరెడ్డి, ఇతర అధికారులు, వర్కింగ్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -