రాజన్న సిరిసిల్లా జిల్లాను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపేందుకు కృషి చేయాలని సిరిసిల్లా అధికార యంత్రాంగానికి మంత్రి కెటి రామరావు పిలుపునిచ్చారు. ఈ రోజు హైదరాబాద్ లోని బేగంపేట్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో పలు అంశాలపైన అధికారులకు మార్గనిర్ధేశనం చేశారు.
భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేసిన జిల్లా కలెక్టర్ కు ఆయన బృందానికి మంత్రి అభినందనలు తెలిపారు. ఇప్పటికే ఓడియప్ కార్యక్రమంలో మెదటి స్థానంలో ఉన్న జిల్లా, ఇప్పుడు భూ రికార్డులను పూర్తి చేసిందని, ఇదే స్పూర్తితో జిల్లాలోని సిరిసిల్లా, వేములవాడ పట్టణాల భూ రికార్డుల ప్రక్షళనకు సిద్దం కావాలని మంత్రి అన్నారు.
జిల్లాలో జరుగుతున్న పలు ప్రాజెక్టులను, అభివృద్ది కార్యక్రమాలను వేములవాడ ఏమ్మెల్యే చెన్నమనేని రమేష్ తో కలిసి మంత్రి ఈ సమావేశంలో సమీక్షించారు. జిల్లాలో కొనసాగుతున్న నీటి పారుదల ప్రాజెక్టుల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న మంత్రి, వాటిని మరింత వేగవంతం చేయాలన్నారు. మానేరు ప్రాజెక్టుల పనులతో పాటు జిల్లాలోని డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులు, వాటికి అవసరం అయిన భూసేకరణ, నిర్మాణం వంటి అంశాలను చర్చించారు. జిల్లాకు మంజూరైన మినీట్యాంకు బండులు, అయా చెరువుల అభివృద్ది, మిషన్ కాకతీయ పనులను మంత్రి సమీక్షించారు. వచ్చే వేసవి నాటికి ఇంటింటికి మంచి నీరు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని మిషన్ భగీరథ, ఆర్ డబ్యూయస్ అధికారులు మంత్రికి తెలిపారు.
వేములవాడలో పట్టణంలో జరుగుతున్న దేవాలయ అభివృద్ది పనులు, పట్టణంలో చేపట్టిన రోడ్ల విస్తరణ వంటి పనులను మంత్రి ఈ సందర్భంగా సమీక్షించారు. దీంతోపాటు సిరిసిల్లా పట్టణంలోని రోడ్ల విస్తరణ, డ్రయినేజీ పనులను సాద్యమైననంత త్వరగా పూర్తి చేయాన్నారు. వచ్చే వర్షకాలం నాటికి జిల్లాలో పూర్తి చేయాల్సిన పనుల జాబితాను సిద్దం చేసుకుని, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా వాటిని వర్షాలు ప్రారంభం అయ్యేనాటికే పూర్తి చేయాలన్నారు. దీంతోపాటు సిరిసిల్లాలో చేపట్టాల్సిన పలు కార్యక్రమాలపైన మంత్రి ప్రత్యేకంగా చర్చించారు. పట్టణంలోని యువకులకు, పిల్లలకు క్రీడా సౌకర్యం కల్పించే లక్ష్యంగా ఇండోర్ స్ట్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు.
పట్టణం చుట్టు చేపట్టిన రింగు రోడ్డు పనులతోపాటు జంక్షన్ల అభివృద్ది కోసం ప్రత్యేకంగా డిజైన్లను సమర్పించాలన్నారు. పట్టణ సుందరీకరణలో భాగంగా వాల్ పెయింగ్స్ చేపట్టాలని, రాజన్న సిరిసిల్లా సాంస్కృతిక నేపథ్యనికి అద్దం పట్టేలా ఇవి ఉండాలన్నారు. పట్టణంలో చేపట్టనున్న పలు నూతన కలెక్టరెట్ల నిర్మాణం, జిల్లా గ్రంథాలయం వంటి పలు సివిల్ పనులను మంత్రి సమీక్షించారు. పట్టణంలో మరింత గ్రీనరీ పెంచాలని, ముఖ్యంగా జంక్షన్లు, రోడ్ల మీడియన్లను మరింత అభివృద్ది చేసేందుకు అవసరం అయిన డిజైన్లను సమర్పించాలని అధికారులను మంత్రి అదేశించారు. పట్టణంలో ఉన్న పార్కులతో పాటు నూతనంగా రెండు పార్కులను ఏర్పాటు చేసేందుకు భూమి అందుబాటులో ఉన్న నేపథ్యంలో సంవత్సరంలోగా వాటిని ఏర్పాటు చేసేందుకు అనుగుణంగా ప్రణాళికలు తయారు చేయాలన్నారు.
జిల్లా అభివృద్ది సాద్యమైనన్ని నిధులను ప్రభుత్వం నుంచి తీసుకుని వస్తామని మంత్రి, ఎమ్మెల్యేలు అధికారులకు తెలిపారు. ప్రభుత్వం సహాకారంతో జిల్లాను రాష్ర్టంలోనే అగ్రభాగాన నిలిపేందుకు అందరం కలిసి పనిచేద్దామని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్తోపాటు వివిధ శాఖల జిల్లాస్ధాయి అధికారులు పాల్గోన్నారు.